మంచిర్యాల టౌన్, డిసెంబర్ 28 : మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సెప్టెంబర్ 30న చివరి సమావేశం నిర్వహించిన పాలకవర్గం, అక్టోబర్‌లో ఆ ఊసే ఎత్తలేదు. నవంబర్‌లో సైతం మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించలేదు. ఇక చివరకు ఈ నెల 30న సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతినెలా ఠంచనుగా నిర్వహించాల్సిన ఈ సమావేశాలను ఎందుకు మూడు నెలల పాటు ఏర్పాటు చేయలేదన్న అంశంపై పాలక, అధికార వర్గాల్లో ఎవరూ నోరుమెదపని పరిస్థితి నెలకొంది. ఇక జనవరి 27తో ఇప్పుడున్న మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగియనున్నది.
మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య తిరుపతి వెళ్లి తిరిగి వచ్చాక జనవరి 2న మున్సిపల్ సమావేశం నిర్వహించాలని అనుకోగా, ఈ నెల 30 తేదీలోగా నిర్వహించకుంటే కౌన్సిల్ రద్దు చేయాల్సి ఉంటుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని వైస్‌చైర్మన్ సల్ల మహేశ్ అధ్యక్షతన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, శనివారం చైర్మన్ ఉప్పలయ్య, వైస్‌చైర్మన్ మహేశ్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు సమావేశమయ్యారు. సమావేశం నిర్వహణ, ఎజెండాలోని అంశాలపై అనుసరించాల్సిన తీరుపై చర్చించారు. పదవీకాలం ముగియనున్న చివరి నెలల్లో కౌన్సిలర్లు తాము అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికైనా వార్డుల్లో పలు రకాల పనులకు అనుమతులు తీసుకునే అవకాశం ఉంటుంది.
కానీ సమావేశాలు నిర్వహించని కారణంగా వారికి ఈ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇపుడున్న పాలకవర్గం తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని సంతృప్తిగా సాగించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. రెండేళ్ల పాటు కరోనాతో సాగించారు. మరో ఏడాది ముగియగానే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, మున్సిపల్ చైర్మన్ మార్పులాంటి అంశాలతో వారి పదవీకాలాన్ని సంతృప్తిగా కొనసాగించలేని పరిస్థితి ఎదురయ్యింది. అసలు మున్సిపల్ సమావేశాలు ఎందుకు నిర్వహించ లేదో అన్న ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు.
దీంతో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, ఇతరత్రా అవసరమైన పనులకు కౌన్సిల్లో చర్చించి, నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. దీనికి తోడు కార్యాలయం పరంగా అత్యవసరంగా చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు, మున్సిపల్ వాహనాలు, పైపులైన్లు, విద్యుత్ మోటార్ల మరమ్మతుల బిల్లులు కూడా కౌన్సిల్ ఆమోదం తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పనులు చేసిన వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సమావేశాలు నిర్వహించని కారణంగా చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులకు నెలనెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు ఆగిపోయాయి.