మంచిర్యాల అర్బన్, నవంబర్ 3 : మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వెనకడుగు వేసేదేలేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు(పీఎస్ఆర్) అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా అధ్యక్షురాలు సురేఖతో కలిసి మాట్లాడారు. రూ.300 కోట్లతో 650 పడకల సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైన రోజు నుంచి రెండేండ్లలో సేవలను అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించారు. లేకుంటే దేనికైన సిద్ధం అని పేర్కొన్నారు.
ఒక వేళ నిర్మాణం నిర్ధేశిత సమయంలో పూర్తయితే ప్రతిపక్ష నాయకులు సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏకమవ్వలేదని, కాణిపాకం గణపతి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. మంచిర్యాలకు కూడా త్వరలో హైడ్రా వస్తుందని, 150 గజాల లోపు ఇండ్లు కట్టుకున్న పేదల జోలికి వెళ్లమని, అంతకంటే ఎక్కువ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న అక్రమార్కులను వదిలేదిలేదన్నారు. బఫర్ జోన్లో ఇండ్లు కోల్పోతున్న బాధితులు తనని కలిశారని, నిబంధనలకు లోబడి ఉంటే వారికి నష్ట పరిహారం ఇప్పించడంతోపాటు మొదటి విడుతలో వస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, మంచిర్యాల వైస్ చైర్మన్ సల్ల మహేశ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు.
కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే
సీసీసీ, నస్పూర్ 3 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు పటేల్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సందర్శించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మెన్ సుర్మిల్ల వేణు, కౌన్సిలర్లతో కలిసి పటేల్ కాలనీలో సందర్శించారు. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు నిర్మించాలని, వర్షాలతో వరద నీరు ఇండ్లలో చేరుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు చిట్ల సత్యనారాయణ, రమేశ్, ఖాలీద్, నరిగె నరేశ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.