మంచిర్యాల, ఆగస్టు 17, నమస్తే తెలంగాణ : బ్రూసెల్లోసిస్ ప్రమాదకరమైన వృత్తి సంబంధిత (జూనోటిక్) సంక్రమిత వ్యాధి. ఇది పాడి పశువులు, జీవాలు, మేకలు, పందులతో పాటు మనుషులకూ అంటుకుంటుంది. దీంతో పాడిపరిశ్రమ, మాంస పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఈ వ్యాధి బ్రూసెల్ల అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవి వృద్ధి చెందేందుకు తక్కువ వాతావరణ ఉష్ణోగ్రత, అపరిశుభ్రమైన పరిస్థితులు, పేదరికం దోహదపడుతాయి. జాతీయ బ్రూసెల్లోసిస్ ఉచిత నివారణ కార్యక్రమం మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి (డీవీఏహెచ్వో) బర్ల శంకర్ తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం సెప్టెంబర్ 19వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగుతుందని, వినియోగించుకోవాలని ఆయన కోరారు.
మనుషులలో వ్యాప్తి చెందే విధానం
వ్యాధికారక సూక్ష్మజీవితో కలుషితమైన పాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాయాలతో కూడిన చర్మంలోకి, కళ్లలోకి సూక్ష్మజీవి చొచ్చుకపోవడం ద్వారా వస్తుంది. జంతువులతో వృత్తిపరంగా సంబంధం ఉండే పశువైద్యులు, పశువైద్య పారా సిబ్బంది, జీవాల పెంపకందారులు, పాడిరైతులు, మాంస పరీక్ష చేసేవారు, పాలు, మాంస పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, మొదలైన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈసుకుపోయిన పశువు గర్భాశయ స్రావాలను తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి లక్షణాలు : ధీర్ఘకాలిక, తీవ్రమైన జ్వరం, కీళ్లవాపులు, నొప్పులు, రాత్రి చెమటలు పట్టడం, దగ్గురావడం, శ్వాస కష్టమవడంవృషణాల వాపుతో పురుషులతో వంధ్యత్వం, స్త్రీలతో గర్భస్రావం కావడం
వ్యాధి చికిత్స : దగ్గరలో ఉన్న వైద్యుడి సలహా మేరకు చికిత్స తీసుకోవాలి
వ్యాధి నివారణ : మనుషులలో టీకాలు లేవు. కాబట్టి పశువులలో వ్యాధి నివారణతో మనుషులలో వ్యాధి నివారించవచ్చు.
పశువులలో వ్యాప్తి చెందే విధానం ..
వ్యాధికారక సూక్ష్మజీవితో కలుషితమైన మేతమేయడం ద్వారా, నీరు తాగడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.గాయాలతో ఉన్న చర్మం ద్వారా వ్యాప్తిస్తుంది. వ్యాధిగ్రస్త మగ పశువు వీర్యాన్ని గర్భధారణకు ఉపయోగించినప్పుడు సోకుతుంది.
వ్యాధి లక్షణాలు : పశువుల్లో ఐదో నెలలో ఈసుకుపోవడం. మాయవేయకపోవడం, గర్భాశయ సంబంధిత వ్యాధులు రావడం. తీవ్రమైన, దీర్ఘకాలిక జ్వరం రావడం. కీళ్లవాపులు, నొప్పులు. వృషణాల వాపు, మగ పశువుల్లో వంధత్వం కలగడం
వ్యాధి చికిత్స : సరైన చికిత్స లేదు. వ్యాధి నివారణ : నాలుగు నుంచి 8 నెలల వయసున్న ఆడ దూడలకు టీకాలు వేయించుకోవాలి. పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త పశువును మంద నుంచి తొలగించాలి.
వ్యాక్సినేషన్ తప్పనిసరి..
బ్రూసెల్లోసిస్ అంటు, ప్రమాదకరమైన వ్యాధి. ఇది పాడి పశువులు, జీవాలు, మేకలు, పందులతో పాటు మనుషులకూ అంటుతుం ది. టీకాలు వేసుకోవడం ద్వారానే నివారించవచ్చు. నెల రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. వినియోగించుకోవాలి.
బర్ల శంకర్, జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి (డీవీఏహెచ్వో)