నార్నూర్, జూలై 7: మెరుగైన వైద్య సేవలందించే సిబ్బంది, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంతో ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ ప్రభుత్వ దవాఖాన కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పీహెచ్సీ 87.50 శాతంతో ప్రథమస్థానంలో నిలిచింది. కొన్నేళ్ల క్రితం గాదిగూడ పీహెచ్సీ లోపలికి వెళ్లాలంటేనే రోగులు, వారి వెంట వచ్చే సహాయకులు భయపడేవారు. పరిసరాల అపరిశుభ్రత, మందుల వాసన అధికంగా వస్తుండడంతో ప్రజలెవరూ ఆ వైపు చూసేవారు కాదు. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సర్కారు వైద్యంపై దృష్టి పెట్టింది. ముందుగా దవాఖానల్లో ఆధునిక వైద్య సామగ్రి అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగానే ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. అన్ని సౌలతులు కల్పించడంతో సిబ్బంది కూడా ఉత్సాహంగా సేవలు అందిస్తున్నారు.
దీంతో అధికారుల దృష్టిలో పడ్డారు. ఉత్తమ సేవలకు గాను ఈ దవాఖాన కాయకల్ప అవార్డును సొంతం చేసుకుంది. దవాఖానలో నాణ్యతా ప్రమాణాలు, రోగులతో వైద్యులు ప్రవర్తించే తీరు, పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, భోజనం, ఇలా అన్ని అంశాలపై నివేదిక సిద్ధం చేసి, కాయకల్పకు ఎంపిక చేశారు. ముఖ్యంగా అమ్మఒడి(కేసీఆర్ కిట్)పథకం ప్రారంభం నుంచి కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నెలకు సుమా రు.15 నుంచి 20 కాన్పులు చేస్తున్నారు. కరోనా కంటే ముందు ఓపీ 100 నుంచి 150 మధ్య ఉండేది. ప్రస్తుతం 50 నుంచి 60 దాకా వస్తున్నారు. ఒక డాక్టరు, 15మంది సిబ్బందితో నిత్యం సేవలు అందిస్తున్నారు. రక్త పరీక్షలు నిర్వహించడం, బీపీ పరీక్షలు, మందులు ఇవ్వడం చేస్తారు. నిత్యం బెడ్లను శుభ్రం చేసి బట్టలను మార్చుతుండడంతో రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దవాఖాన ఆవరణలో పచ్చదనం, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్, నిత్యం వ్యర్థాల తరలింపు చేస్తుండడంతో కాయలక్పకు ఎంపికైంది.
ఉన్నతాధికారుల సలహాలు పాటించడం..
గాదిగూడ పీహెచ్‌సీని మోడల్ పీహెచ్ సీగా తీర్చిద్దిదేందుకు ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పాటించాం. దవా ఖానలో సౌకర్యాలు కల్పించడంతో పా టు సిబ్బంది పనితీరులో మార్పు వచ్చిం ది. మానవతా దృక్పథంతో ఆలోచించి మెరుగైన వైద్యం అందించాం. అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు కనబర్చడంతో కాయకల్ప అవార్డుకు ఎంపికైంది.
-పవన్‌కుమార్( మెడికల్ అధికారి. గాదిగూడ పీహెచ్సీ)
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం..
కాయకల్ప పథకానికి ఎంపికయ్యేందుకు రూపొందించిన అంశాలను నిత్యం క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాం. సూచనలు,సలహాలు ఇచ్చాం. ఎలాంటి లోపాలున్నా గుర్తించి వాటిని వైద్యుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయించడం వంటివీ చేశాం. మున్ముందు మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. గాదిగూడ పీహెచ్సీ కాయకల్ప పురస్కరానికి ఎంపికవడం హర్షనీయం.