మంచిర్యాల, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయాల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను అధికార పార్టీ నేలమట్టం చేయడం విమర్శలకు తావిస్తున్నది. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు పేరిట నిర్మాణ దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ బిల్డింగ్ కూల్చివేతను స్వయంగా ఎమ్మెల్యే పీఎస్సార్ ప్రారంభించడం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రజాధనం వృథా చేయడమేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో 4.22 ఎకరాలను కొత్త హాస్పిటల్ కోసం కేటాయించారు. ఆర్అండ్బీ శాఖ, మున్సిపల్ శాఖ స్థలాన్ని టీఎస్ఎంఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగిస్తున్నట్లు లెటర్లు సైతం ఇచ్చాయి. జిల్లా అధికారుల నుంచి లెటర్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని తెలిసింది. వైద్యారోగ్యశాఖలో పని చేసే ఓ అధికారే.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు రాలేదని చెప్పడం గమనార్హం. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్‌ను కూల్చేందుకైనా పర్మిషన్ ఉందా అంటే.. అదీ లేదనే తెలుస్తున్నది.
మున్సిపాలిటీ ఫండ్స్‌తో నిర్మించిన ఈ భవనాన్ని కూల్చాలంటే మున్సిపల్లో తీర్మానం చేసి, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండానే ఇష్టారాజ్యంగా కూల్చివేశారు. ఈ విషయంపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్‌ను వివరణ కోరగా.. కూల్చివేతల విషయం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లే చూసుకుంటున్నారన్నారు. మాకు ఈ విషయంలో సంబంధం లేదన్నారు. కూల్చివేత పర్మిషన్లు కూడా వాళ్లే తీసుకుంటారంటూ దాటవేసే ధోరణితో సమాధానం చెప్పారు.
రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.7.20 కోట్లు కేటాయించింది. ఎంఏయూడీ నుంచి రూ.4.50 కోట్లు, మున్సిపాలిటీ నుంచి రూ.2.70 కోట్లు మంజూరు చేశారు. దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. దీంతో పాటు గతేడాదే రూ.3 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్, రూ.3 కోట్లు విలువ చేసే పాత ఆర్అండ్బీ ఆఫీస్ కార్యాలయాలు సైతం కూల్చివేయనున్నట్లు తెలిసింది.
ఈ లెక్కన రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తుల విధ్వంసానికి తెరలేపినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జీజీహెచ్ (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్)కోసం కాలేజీ రోడ్‌లోని మార్కెట్ యార్డు స్థలంలో 450 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నారు. అక్కడ మొత్తం 11 ఎకరాలుండగా, 4 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది. ఇది వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటిని పూర్త అవుతుంది. అప్పుడు ప్రస్తుతం మెడికల్ కాలేజీగా ఉన్న షెడ్లు సైతం ఖాళీ అవుతాయి.
ఇక్కడ మరో 5 ఎకరాలు అందుబాటులో ఉంటుంది. అంతగా కావాలంటే అక్కడ ఈ హాస్పిటల్‌ను నిర్మించవచ్చు. అలా చేస్తే మంచిర్యాలలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ జీజీహెచ్‌కు, ఎంసీహెచ్(మాతాశిశు హాస్పిటల్)పై అనుసంధానం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడే దవాఖాన నిర్మిస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ పట్టుపట్టడంపై జనాలు మండిపడుతున్నారు. ఎవరి కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
దవాఖాన నిర్మిస్తే మంచిదేకానీ.. ఉన్న బిల్డింగ్‌ను కూల్చివేసేందుకు కొబ్బరికాయలు (101 కొబ్బరికాయలు) కొట్టడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించే ముందు కొబ్బరికాయలు కొడుతారు, కానీ దానికి విరుద్ధంగా బిల్డింగ్ కూలకొడుతూ కొబ్బరికాయలు కొట్టి ఆనందపడడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా కక్షసాధింపు చర్యే : మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యే. ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను కూల్చివేసేందుకు సర్కారు ఎలా అనుమతించింది. ప్రస్తుత జీజీహెచ్‌ను 450 పడకల దవాఖానలోకి మార్చి, ఏరియా హాస్పిటల్, ఎంసీహెచ్‌ను షిప్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఇది కూల్చి కట్టాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు.. పాత హాస్పిటల్ స్థానంలో కొత్తది కూడా కట్టొచ్చు. ఆ దిశగా ఆలోచన చేస్తే ఇంత విధ్వంసం అవసరముండదు కదా.
ఎన్నికలకు ముందు కూలకొడుతా అన్న మాటకు కట్టుబడి, దాదాపు రూ.10కోట్ల ఆస్తి నష్టం చేశారనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవడానికి ఇలాంటి చర్యలకు దిగడం సరికాదు. లక్షా యాభై వేల జనాభా ఉన్న పట్టణానికి మరో మార్కెట్ అయితే అవసరం ఉంది. ఈ కూల్చివేసిన దాని స్థానంలో కొత్తది ఎక్కడ కడతారో ప్రజలకు సమాధానం చెప్పాలి.