తాండూర్/బెల్లంపల్లి, మే 15 : ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల మారెట్ను వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి షాపుల కేటాయింపుకోసం లబ్ధిదారులను లకీడ్రా పద్ధతిన ఎంపిక చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 31 షాపులకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
రైతులకు టార్పాలిన్లు సమకూరుస్తాం
భీమారం, మే 15 : అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్లు సమకూరుస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పోలంపల్లి, ఖాజీపల్లి వరిధాన్య కొనుగోలు కేంద్రాలతో పాటు భూభారతి సదస్సుల ప్రక్రియను పరిశీలించారు.
తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ సౌకర్యం కల్పించడంతో పాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందేలా చూస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీరందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.