మంచిర్యాల టౌన్, నవంబర్ 9 : సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని సాయికుంటలో ప్రారంభమైన సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఫార్మాట్లో పేర్కొన్న అంశాలను పూర్తిగా కుటుంబ సభ్యుల నుంచి సేకరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా సర్వే పూర్తిచేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 236 మంది ఎన్యూమరేటర్లు, 23 మంది సూపర్వైజర్లు సర్వేలో పాల్గొంటున్నారని మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ తెలిపారు.
నస్పూర్ మున్సిపాలిటీలో..
శ్రీరాంపూర్, నవంబర్ 9 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 17 వార్డుల్లో ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేను శనివారం కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. పలు వార్డుల్లో ఎన్యూమరేటర్లు చేస్తున్న సర్వేను కలెక్టర్, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీశ్, చైర్మన్ వేణు పరిశీలించారు. కౌన్సిలర్లు చీడం మహేశ్, పూదరి కుమార్, మేకల దాస్ పాల్గొన్నారు.
స్పష్టంగా నమోదు చేయాలి
నస్పూర్, నవంబరు 9 : సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని 5,6,7 వార్డుల్లో, మంచిర్యాలలోని 5వ వార్డులో సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు సతీష్, మారుతీప్రసాద్ పాల్గొన్నారు.
బాధ్యతగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, నవంబర్ 9 : సమగ్ర కుటుంబ సర్వేను బాధ్యతగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సర్వే లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత ఎన్యూమరేటర్లపై ఉంటుందన్నారు. ఫారంలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ప్రజల వద్ద నుంచి సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు పాల్గొన్నారు.
తప్పుల్లేకుండా చూడాలి
ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 9 : సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారులకు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీగా పూర్తిచేసిన సర్వే వివరాలను సాయంత్రం 6 గంటల్లోగా అందజేయాలన్నారు. తప్పుల్లేకుండా చూడాల్సిన బాధ్యత నోడల్ అధికారులపై ఉంటుందన్నారు. సర్వేపై ప్రజల్లో అపోహలుంటే తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.