మంచిర్యాలటౌన్, ఆగస్టు 11 : నులి పురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురసరించుకొని సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,58,480 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ మాత్రలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఉప వైద్యాధికారి డాక్టర్ అనిత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, వైద్య, ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి : డీఎంహెచ్వో
సీసీసీ నస్పూర్, ఆగస్టు 11: పిల్లలకు తప్పని సరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజ్ సూచించారు. సోమవారం నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మార్టిన్ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సబిహ సుల్తానా, వైస్ ప్రిన్సిపాల్ సయ్యద్ వాసీం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ అనిత, డాక్టర్ శివప్రతాప్ నాందేవ్, వెంకట్, ఆరోగ్య కార్యకర్తలు పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
‘ఆల్బెండజోల్’ అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ధోత్రే
ఆసిఫాబాద్ టౌన్,ఆగస్టు 11 : 19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ పీటీజీ బాలుర పాఠశాల, కళాశాలలో ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,07,702 మంది పిల్లలకు మాత్రలు తప్పనిసరిగా అందించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, వైద్యులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఓంకార్ కృష్ణ, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.