చెన్నూర్, మార్చి 13 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూర్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలు పరిశీలించి.. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా? లేవా అనే విషయాన్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే దవాఖానలో రోగులకు చేస్తున్న పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు సకాలంలో వస్తున్నాయా? లేవా తెలుసుకున్నారు. ప్రపంచ కిడ్నీ (డయాల్సిస్) దినోత్సవం సందర్భంగా డయాల్సిస్ పేషెంట్లతో కలసి కేక్ కట్ చేశారు. అనంతరం దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసి టీబీ పరీక్షా యంత్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గుణాత్మక విద్యనందించాలి..
నస్పూర్, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాలలు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీరందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.