సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 8 : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్‌లోని ఎంఎం గార్డెన్లో నిర్వహించిన బ్రిలియంట్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ అ్యతిథిగా హాజరయ్యారు. బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 ఏళ్లుగా బ్రిలియంట్ విద్యాసంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులు చదువులతో పాటు వివిధ యాక్టివిటీస్‌పై దృష్టిసారించాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ మాట్లాడుతూ నస్పూర్‌లో తమ పాఠశాలను ప్రారంభించి తొమ్మిదేళ్లు అవుతుందని, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు బాటలు వేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.