మంచిర్యాలటౌన్, అక్టోబర్ 30 : గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రజలను కోరారు. మంచిర్యాల పట్టణంలోని 20వ వార్డు రాంనగర్లో సోమవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వివరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. పైగా అమలుకు నోచుకోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు కోతలతో సతమతమవుతున్నారని తెలిపారు.
దీంతో ఇక్కడ చేతిగుర్తుకు ఓటు వేస్తే మిగిలేది ఏమీ ఉండదని, ఇక పువ్వు గుర్తుకు ఓటువేస్తే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తారని, ప్రజలకంటే వారి స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని అనే వారు ఒక్కసారి కండ్లు తెరిచి చూడాలని హితవు పలికారు. పాత మంచిర్యాల నుంచి ఇందారం క్రాస్ వరకు నాలుగు వరుసల రహదారి, ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు చేపట్టబోయే ఆరు వరుసల రహదారి, హమాలీవాడ దగ్గర రెండు వరుసల అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి, ప్రధాన రహదారిపై నాలుగు ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న చూడముచ్చటైన సర్కిళ్లు, పట్టణంలో అంతర్గత రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు, పూర్తయిన పార్కులు, ఓపెన్‌జిమ్ కనబడటంలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదమల్ల హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు అంకం నరేశ్, సురేశ్ బల్దవా, మాదంశెట్టి సత్యనారాయణ, ప్రకాశ్‌నాయక్, నాయకులు పల్లపు తిరుపతి, గడప రాకేశ్, గరిగంటి సరోజ, ఎర్రం తిరుపతి, బొలిశెట్టి రాజన్న, బొలిశెట్టి కిషన్, ప్రవీణ్, సుధీర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, అక్టోబర్ 30 : మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో దివాకర్ రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. రానున్న ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట హాజీపూర్ ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, జడ్పీ కో-ఆప్షన్ నయీం పాషా, పార్టీ మండలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, రాపెల్లి సర్పంచ్ అనె మల్లేశ్, నాయకులు మట్టపెల్లి సత్యనారాయణ రావు, మాజీ సర్పంచ్ సీపెల్లి మొగిళి, మాజీ ఉప సర్పంచ్ అబ్దుల్లాతో పాటు కార్యకర్తలు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.