హాజీపూర్, మే13 : ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, పెండ్లి పేరిట మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. వివరాలిలా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కాళహస్తి శిరీశ్‌కుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల షాదీ డాట్ కామ్, మాట్రీమోనీ ద్వారా హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన రాంపెల్లి రజితతో పరిచయం పెంచుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ నెల ఒకటిన మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై రజిత ఇంటికి వచ్చాడు. పెండ్లికి కావాల్సిన బంగారు ఆభరణాలు చేయిస్తానని చెప్పి మంచిర్యాలలోని ఓ షాప్‌నకు తీసుకెళ్లాడు. అక్కడ చేయించిన బంగారం తాడు పట్టుకొని తిరిగి ప్రయాణమయ్యారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కర్ణమామిడికి వస్తూ మార్గంమధ్యలో గుడిపేట ఫిష్ మార్కెట్ దాటిన తర్వాత బండిని నిలిపివేశాడు. ఓసారి బంగారు తాడు బరువు చూస్తా.. ఇవ్వమని కోరాడు.
అది తీసుకున్న తర్వాత ఆమెను పక్కకు నెట్టేసి బైక్‌పై హైదరాబాద్ పారిపోయాడు. ఈ నెల 12న శిరీశ్కుమార్ను పట్టుకొని అతని వద్ద నుంచి కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. శిరీశ్‌కుమార్ గతంలోనూ ప్రకాశం జిల్లాలో మూడు బైక్‌లు దొంగిలించి జైలుకు వెళ్లాడు.మాట్రీమోనీ సైట్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఒంటరి మహిళతో పరిచయం పెంచుకొని ఆమె వద్ద నుంచి కూడా రూ.3 లక్షలు తీసుకొని పారిపోయాడని సీఐ తెలిపారు. అతడిని పట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎస్ఐ కిరణ్‌కుమార్, సిబ్బంది తిరుపతి, సత్యనారాయణ, చంద్రశేఖర్, రాజేందర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.