ఎదులాపురం, ఫిబ్రవరి 14 : ఆదిలాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ, భాగ్యనగర్, తిలక్‌నగర్ తదితర కాలనీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా రూ.45 లక్షలతో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ మెమోరియల్ పార్కును మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి ప్రారంభించారు.
కార్యక్రమానికి వచ్చిన ముఖ్యఅతిథులకు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడంతో పాటు, నిత్యం వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్ సదుపాయాన్ని కూడా పార్కులో ఏర్పాటు చేశామన్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఏండ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవల ఐటీ టవర్ నిర్మాణానికి సైతం నిధులు మంజూరయ్యాయని, కలెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ధి చేసి ఆహ్లాదం పంచేలా రూపుదిద్దినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, కౌన్సిలర్లు అశోక్ స్వామి, సంజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు కొండ గణేశ్, రాము, మిషు, భూమన్న, దమ్మపాల్, సాజిదొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
చెక్కులు, కుట్టు మిషిన్ల పంపిణీ..
న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషిన్లు, ధృవపత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని తాటిగూడ, భాగ్యనగర్‌కు చెందిన 41 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. అంతకుముందు పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగ నిరతిని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో సహా నిరుపేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు స్వయం ఉపాధి శిక్షణ పొందుతూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
ఆ దిశగా న్యాక్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టిన ఆయన, ప్రజా సంక్షేమంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, వాటిని సమర్థవంతంగా అమలు చేసున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అనవసర విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందనిఆయన అన్నారు.