కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్లోని శ్రీ విఠలేశ్వరాలయంలో సోమవారం అయ్యప్ప మహపడిపూజ ( Maha Padipuja ) మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పుప్పాల దేవన్న గురు స్వామి 18 సంవత్సరాలుగా మాలధారణ చేసిన నారికేళ గురుస్వామిని తోటి గురు స్వాములు, అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించారు.
ముందుగా గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం( Abhishekam), ప్రత్యేక పూజలను రేపల్లెకు చెందిన తోట శివ శంకర్రావు గురుస్వామి కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మెట్ల పూజ ఆకట్టుకుంది. హరిహర మ్యూజిక్ నిర్మల్ ఆర్కెస్ట్రా బృందం ఆలపించిన పాటలు, చిన్నారుల నృత్యాలు అలరింపజేశాయి.
స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప శరణం.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో కుభీర్ పట్టణం మార్మోగింది. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.