దండేపల్లి, ఫిబ్రవరి 24 : గూడెం శ్రీసత్యనారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఘనంగా జాతర జరిగింది. జిల్లా నుంచేగాక జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. 252 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం వైభోపేతంగా నవగ్రహ హోమాలు, జయాది హోమం, శాంతి హోమం, పంచసూక్తహోమ యజ్ఞాలు, బలిహరణం, నిత్య హోమాలు నిర్వహించారు. నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థప్రసాదగోష్టి, హవనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ప్రధాన అర్చకులు గోవర్ధన రఘుస్వామి, అర్చకులు సంపత్స్వామి, వేద పండితులు నారాయణశర్మ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు.