కాసిపేట, జనవరి 8 : మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 ఇైంక్లెన్ గనికి చెందిన సీనియర్ మైనింగ్ సర్దార్ మచ్చ రమేశ్(32) గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డిసెంబర్ 21న నైట్ షిఫ్ట్ విధులు ముగించుకొని నడుచుకుంటూ వస్తున్న క్రమంలో టబ్బు రేల్స్పై అడుగుపెట్టి జారి పడ్డాడు. కాలుకు తీవ్రగాయం కాగా రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
వైద్యులు కాలు విరిగిందని నిర్ధారించారు. అక్కడి నుంచి గోదావరిఖని ఏరియా హాస్పిటల్‌కు తీసుకొచ్చి చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సరైన వైద్యం అందించకపోవడం వల్లే రమేశ్ మృతి చెందినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గని ప్రమాదంగా గుర్తించి కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువ కార్మికుడి మృతితో గనిపై విషాదం నెలకొంది. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.