కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సర్పంచ్( Sarpanch), వార్డు సభ్యుల అభ్యర్థులు ( Candidates ) విద్యుత్ శాఖ నో డ్యూ సర్టిఫికెట్ ( No Due Certificate ) కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామినేషన్ కోసం విద్యుత్ శాఖ నో డ్యూ సర్టిఫికెట్ కావాలని తెలపడంతో అభ్యర్థులు మండలంలోని కొండాపూర్ సబ్ స్టేషన్ విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు అందుబాటులో లేకపోవడం, ఏఈ లీవ్ లో ఉండడంతో అభ్యర్థులు కార్యాలయానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. కాసిపేట నుంచి బెల్లంపల్లికి వెళ్లడం వల్ల సమయం వృధా అవుతుందని, అక్కడ కూడా త్వరగా పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మండలం కావడంతో ఆలస్యం చేస్తున్నారని, నామినేషన్ సమయం తక్కువగా ఉందని, వెంటనే దీనిపై అధికారులు చర్యలు తీసుకొని స్థానికంగా కాసిపేట మండలంలోనే నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు కోరుతున్నారు.