కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో దేశీదారు దందా జోరుగా సాగుతున్నది. కొందరు దీనినే వృత్తిగా మార్చుకొని మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో ఇక్కడి బెల్టు షాపులకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. తక్కువ ధరకే దొరుకుతున్న దేశీదారును కొనుక్కునేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపుతుండగా, ఇక్కడి వైన్స్‌లకు గిరాకీ పడిపోతుందంటూ యజమానుల్లో ఆందోళన కనిపిస్తున్నది.
నాడు అలా.. నేడు ఇలా
జిల్లాలోని రెండు డివిజన్లలో 32 మద్యం దుకాణాలు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మూడు బార్లు ఉన్నాయి. గతంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో మద్య నిషేధం అమల్లో ఉండగా, సరిహద్దు మండలాలైన సిర్పూర్-టీ, కౌటాల, చింతలమానేపల్లి మండలాలతో పాటు బార్డర్లో ఉన్న వాంకిడి మండలంలోని కొన్ని మద్యం దుకాణాల నుంచి మహారాష్ట్రకు మద్యం సరఫరా అయ్యేది. దీంతో ఇక్కడున్న మద్యం దుకాణాలకు భారీగా డిమాండ్ ఉండేది. 2022, జూన్ నుంచి చంద్రాపూర్‌లో మద్య నిషేధం ఎత్తివేయగా, అక్కడి నుంచి దేశీదారును ఆసిఫాబాద్ జిల్లాలోకి సరఫరా అవుతున్నది. దేశీదారు తక్కువ ధరకే లభిస్తుండడంతో దానిని కొనుక్కునేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఇక్కడి మద్యం దుకాణాలకు గిరాకీ తగ్గి.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.
90 ఎంఎల్.. రూ. 45కే..
మహారాష్ట్రలో దేశీదారు 90 ఎంఎల్ రూ. 45కే లభిస్తోంది. ఇక్కడ లభించే అదే పరిమాణంలోని మద్యానికి రూ. 90 వరకు ధర ఉంటుంది. పైగా ఇక్కడి మద్యంతో పోలిస్తే దేశీదారులో మత్తు ఎక్కువగా ఉంటోంది. దీంతో కార్మికులు, కూలీలు ఎక్కువగా దేశీదారువైపే మొగ్గుచూపుతుంటారు. ఇదే అదనుగా కొందరు ఈ అక్రమ దందాను కొనసాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లో సరుకుల తరహా సంచుల్లో ఇక్కడికి తీసుకొచ్చి బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారు. వాంకిడి మినహా ఎక్కడా తనిఖీ కేంద్రాలు లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోం ది. అప్పుడప్పుడు అధికారులు దేశీదారును పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా.. వారి కంటపడినవి మాత్రం అనేకం ఉంటున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో దేశీదారు విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల పట్టుబడ్డ బాటిళ్లు
నాలుగు రోజుల క్రితం కాగజ్‌నగర్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో పెద్ద ఎత్తున దేశీదారు నిల్వలున్నాయన్న సమాచారం మేరకు ఆ బ్కారీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిం చి 580 దేశీదారు మద్యం బాటిళ్ల(90 ఎం. ఎల్)ను పట్టుకున్నారు. వీటి విలువ సు మారు రూ. 30 వేలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. పొరుగు న్న ఉన్న మహారాష్ట్ర నుంచి సిర్పూర్, చింతలమానేపల్లి మండలం గూడెం మీదుగా మహారాష్ట్ర నుంచి దేశీదారు పెద్ద ఎత్తున తరలివస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.