బచ్చన్నపేట, ఆగస్టు 15 : తమ గ్రామం లో ఇక నుంచి మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నామని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామస్తులు గురువారం రాత్రి ప్రకటించారు. గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశం, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళ లు, యువకులంతా ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబాలు, యువతను చిత్తు చేస్తున్న మద్యాన్ని తమ గ్రామ దరి చేరనీయమని ప్రతిజ్ఞ చేశారు. ఎక్సైజ్ శాఖ, పోలీసులను పిలిపించుకొని తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ప్రభావతి గ్రామ ప్రజలతో మద్య నిషేధంపై ప్రతిజ్ఞ చే యించారు. గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పలు పార్టీల నేతలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు.
వరంగల్, ఆగస్టు 15 : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పోచంపల్లి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోచంపల్లి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. పోచంపల్లికి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.