ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 4 : మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేని వానకు బుధవారం కుమ్రం భీం ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు(10.393 టీఎంసీలు) ఉండగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 8970 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రావడంతో ప్రస్తుత నీటి మట్టం 237.5 మీటర్లు(5.688 టీ ఎంసీలు)లకు చేరిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 3, 4, 5, 6, 7 గేట్లను 1 మీటర్ వరకు ఎత్తి 10480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
వట్టివాగు ప్రాజెక్టు 5వ గేటు ఎత్తివేత
వట్టివాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 241.50 మీటర్లు(2.89 టీఎంసీలు) ఉండగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 7770 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రావడంతో ప్రస్తుత నీటి మట్టం 237.400మీటర్లు(2.078 టీఎంసీలు)లకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 5వ గేట్‌ను 0.2 మీటర్లు ఎత్తి 2160 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.