తాంసి : గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో (Competitive exam books ) విజయ సాధన కోసం మరింత ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలారం జాదవ్ ( Balaram Jadav) ఆదివారం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాంసి మండలం కప్పర్ల గ్రామంలోని గ్రామ గ్రంథాలయానికి ( Library ) రూ.15 వేల విలువ చేసే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బలారం జాదవ్ మాట్లాడుతూ ‘ గ్రామీణ యువతకి తగిన అవకాశాలు లభించడం కోసం, వారు సివిల్ సర్వీసులు, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ రిక్రూమెంట్ లాంటి పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని ఆశిస్తున్నాం. పుస్తకాలు, గ్రంథాలయ వనరులు అందుబాటులో ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి అభ్యర్థి పుస్తకాలతో కష్టపడి చదివి, లక్ష్యాన్ని చేరుకోవాలి’ అని సూచించారు.
ఈ పుస్తకాల అందజేసినందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పుస్తకాలు పరిశీలించారు. స్థానిక పెద్దలు, గ్రామస్థులు, విద్యార్థులు బలారం జాదవ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, తదితరులు ఉన్నారు.