మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 14 : మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాలలోని తన నివాసంలో భూములు కోల్పోతున్న బాధితులు, అడ్వకేట్ దొమ్మటి అర్జున్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోచంపాడ్, వేంపల్లి శివారులోని భూములన్నీ దాదాపు దళిత రైతులవేనని, వారి నోట్లో మట్టికొట్టి కోట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అధికారులు సైతం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
చట్టప్రకారం నడుచుకోవాల్సిన అధికారులు కూడా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. భూసేకరణ కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలని, వివరాలను పబ్లికేషన్ చేయాల్సి ఉంటుందని, మార్కెట్ ధరను దృష్టిలో పెట్టుకుని భూముల ధర నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. కానీ ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళిత రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ భూములన్నీ అసైన్డ్వేనని, మీరు ఇచ్చినా ఇవ్వకున్నా భూములు తీసుకుంటామని, తాము చెప్పిన ధరకే ఒప్పుకోవాలని బలవంతం చేశారన్నారు. బాధితులైన దళిత రైతులను కలిసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వచ్చిన సందర్భంలో పెద్ద సంఖ్యలో పోలీస్ పికెటింగ్‌లు పెట్టారని, రైతులను కలువకుండా చేశారని మండిపడ్డారు.
దాదాపు 300 ఎకరాల భూమిని సేకరించాలని చూస్తున్నారని, ఎకరాకు కేవలం రూ. 13 లక్షలకు సేకరించి.. వాటిలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించి ఎకరాకు రూ. రెండు కోట్లకు పైగా అమ్మేయాలన్నది ఎమ్మెల్యే పీఎస్సార్ ప్లాన్ అని, అందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను పాటించాలని, దళితులకు ఇచ్చిన భూముల్లో వారికే దళితబంధు ఇచ్చి కంపెనీలు పెట్టించాలని, ఆర్థికసాయం అందించి వారి అభివృద్ధికి దోహదపడాలని అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి అప్పటి భూమి విలువ కేవలం రూ. 15 వేలు మాత్రమే ఉంటే.. తాము రూ. 1.82 లక్షలు ఇప్పించామని గుర్తు చేశారు. అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని, నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలని, దళిత రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, భూములివ్వాలని తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భూములు కోల్పోతున్న రైతులు గజ్జెల్లి లక్ష్మి, మాడుగుల నర్సయ్య, నాగమల్ల ప్రకాశ్, మాడుగుల సతీశ్, గజ్జెల్లి రాజశేఖర్, మాడుగుల పెద్దపోశం, బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, వేంపల్లి, ముల్కల, పోచంపాడ్ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.