రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 13: క్యాతనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చుతూ ప్రవేశ పెట్టిన బిల్లు మంగళవారం శాసన సభలో ఆమోదం పొందడంతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుల సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. సిరుల తల్లి సింగరేణి గర్భం నుంచి పురుడు పోసుకున్న ఊరు రామకృష్ణాపూర్ అని, ఒకప్పుడు ఆర్కే-1, ఆర్కే-2, ఆర్కే-3, ఆర్కే-4, ఆర్కే-7,8, ఏరియా వర్క్ షాప్, స్టోర్, టింబర్ యార్డు, గ్యారేజీ గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబాలతో రామకృష్ణాపూర్ నిత్యకల్యాణం పచ్చతోరణంలా విలసిల్లిందని విప్ బాల్క సుమన్ శాసనసభలో పేర్కొన్నారు.
పట్టణానికి పూర్వవైభవం తెచ్చేందుకు మున్సిపాలిటీకి రామకృష్ణాపూర్‌గా పేరు మార్పు చేస్తేనే గుర్తింపు వస్తుంద న్నారు. రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ది చెందుతుందన్నారు. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్పుతో పట్టణ ప్రజలు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అభినందిస్తున్నారు. శాసన సభలో బిల్లు ఆమోదం పొందడంతో సూపర్ బజార్ సెంటర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, కార్మిక సంఘాల అధ్వర్యంలో పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. సర్వమత ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్‌రెడ్డి, మందమర్రి జడ్పీటీసీ ఏల్పుల రవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, యాకూబ్అలీ, రామిడి కుమార్, బైరమల్ల మెగిలయ్య, కౌన్సిలర్లు గోపు రాజం, యూత్ నాయకులు ఎర్రబెల్లి రాజేశ్, శివకిరణ్, చంద్రకిరణ్, ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 13, నమస్తే తెలంగాణ : చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపల్‌ను రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్చుతున్నట్లు మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మంగళవారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నేరుగా ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి కోరిక మేరకు పేరు మార్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. క్యాతనపల్లి మేజర్ గ్రామపంచాయతీ అని, రామకృష్ణాపూర్ (18 వార్డులు) పట్టణంగా అభివృద్ధి చెందిందని బాల్క సుమన్ వివరించారు.