కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మారుమూల పల్లెల్లో జోరుగా గంజాయి సాగవుతున్నది. మహారాష్ట్ర వ్యాపారుల ప్రలోభాలకుగురై.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఇక్కడి రైతులు పత్తి చేలల్లో అంతరపంటగా వేస్తూ, గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయగా, ఈ దందా చేసే వారికి దడ మొదలైంది.
పత్తి చేల నడుమ గంజాయి సాగు
నాలుగు రోజుల క్రితం తిర్యాణి మండ లం కొద్దుగూడలో రైతు ఆత్రం పాపారావు తన పత్తి చేనులో సాగు చేస్తున్న గం జాయి మొక్కలను పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. ఇటీవల జైనూర్ మండలం జారుగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు పెంచుతున్న విషయం తెలిసి ట్రాస్క్ఫోర్స్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు. సిర్పూర్-యు మండలం కాకర్బుడ్డి గ్రామంలో ఓ రైతు తన పత్తి చేనులో సాగు చేస్తున్న 47 గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు.
అలాగే కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామానికి చెందిన వాడాయి పోశెట్టి పత్తి చేనులో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేశారు. 130 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. కొన్ని రోజుల క్రితం కెరమెరి మండలం దేవుడుపల్లిలో పోలీసులు తనిఖీలు చేయగా, తాక్సాండే పోచిరాం పత్తి చేనులో గంజాయి మొక్కలు కనిపించాయి. సిర్పూర్-యులో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది గంజాయికి సంబంధించి 47 కేసులు నమోదు చేసి 93 మందిని అరెస్టు చేశారు. 15 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు.
‘మహా’వ్యాపారుల ప్రోత్సాహంతో అంతరపంటగా..
ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులతో మహారాష్ట్ర ప్రాంతంలోని వారికి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు అక్కడి వ్యాపారులు ఇక్కడి రైతులతో పరిచయాలు పెంచుకొని గంజాయికి సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మహారాష్ట్ర వ్యాపారుల ప్రలోభాలకు తలొగ్గి పత్తిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. పత్తి చేలల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుంటారని సమాచారం.
కెరమెరి, వాంకిడి, జైనూర్ తదితర మండలాల నుంచి మహారాష్ట్రకు వెళ్లేందుకు అటవీమార్గం గుండా దారులు ఉండడంతో ఈ ప్రాంతంలో సాగైన గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా కాలినడకన, సైకిల్మోటార్లపై కూడా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా కాకుండా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గంజాయిని సాగు చేస్తూ పట్టుబడిన ఘటనలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో వెలుగు చూడడం విశేషం. మత్తు పదార్థాల రవాణాకు బ్రేక్ వేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.