కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన యాసంగి సాగు, ఈయేడాది తగ్గుముఖం పట్టింది. గతేడాది ఇదే సీజన్లో దాదాపు 43 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయగా, ఈసారి 30 వేల ఎకరాల్లోపే సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 40 వేల ఎకరాల్లో సాగు ఉంటుందని అధికారులు భావించినప్పటికీ, 30 వేల ఎకరాల్లోపే పంటలు వేస్తున్నట్లు తెలుస్తున్నది.
కేసీఆర్ సర్కారులో 24 గంటల ఉచిత విద్యుత్, సాగు నీటి వనరులతో దర్జాగా పంటలు తీసిన రైతాంగం, ఈసారి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయానికి అనధికారిక విద్యుత్ కోతలు మొదలు కాగా, కరంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందోనన్న భయం రైతులను వెంటాడుతుంది. దీనికి తోడు జిల్లాలో ప్రధాన సాగునీటి జలాశయమైన కుమ్రం భీం ప్రాజెక్టులో 10 టీఎంసీల నీటి నిల్వకు బదులుగా 5 టీఎంసీలనే ఉంచడం, కాలువల ద్వారా ఇంకా నీటిని విడుదల చేయకపోవడంతో యాసంగి సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు.
సాధారణంగా ఈ సీజన్లో ప్రధానంగా వరి సాగు ఎక్కువగా ఉంటుంది. తర్వాత జొన్న, మక్క, పప్పు దినుసులువంటివి పండిస్తారు. గత యాసంగిలో 18 వేల ఎకరాల్లో వరి వేయగా, ఈ ఏడాది 4,500 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. గతేడాది 7,881 ఎకరాల్లో శనగ వేయగా, ఈసారి 4,600 ఎకరాల్లో సాగవుతోంది. గతేడాది 2,148 ఎకరాల్లో పెసర సాగు కాగా, ఈ ఏడాది 425 ఎకరాల్లో మాత్రమే వేశారు. జొన్న, మక్క పంటలు కూడా గతేడాదితో పోలిస్తే ఈ సారి సగానికి పైగా తగ్గినట్లు తెలుస్తోంది. దాదాపు 30 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తున్నది.
ఇక బోర్లు ఉన్న రైతులు ఫిబ్రవరి చివరి వరకు కూడా జొన్న, మక్క టమాట, బెండ, బీరవంటివి సాగు వేస్తుంటారు. మూడు నెలల్లోనే ఈ పంటలు చేతికి వస్తాయి. అయితే.. ఈ ఏడాది ఎండలు కూడా ముందే పెరగడం, విద్యుత్ కోతలు మొదలవ్వడంతో ఆ పంటల సాగులోనూ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. గతంలో కుమ్రం భీం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసేవారు. కాలువల్లో పైపులు వేసి ఆయిల్ ఇంజన్ల ద్వారా పంటలకు నీరు మళ్లించుకునేవారు. ఈసారి పంట కాలువల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా కూడా రైతులు నీరు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది.