కెరమెరి, డిసెంబర్ 28 : ఆదివాసుల ఆరాధ్య దేవత జంగుబాయి జాతరను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం హట్టి ఆశ్రమ పాఠశాలలో జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించే జంగుబాయి జాతరపై ఉత్సవ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, మహిళలకు 10 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఉమ్రి నుంచి పరందోలి తండా వరకు రోడ్డు మరమ్మతులు చేపిస్తామని, టొప్లకస వద్ద నిర్మించిన వంతెన వద్ద రహదారి మెరుగు పరుస్తామని చెప్పారు. భక్తులు స్నానాలు ఆచారించే టొప్లకస, అక్కడి నుంచి జంగుబాయి ఆలయం వరకు రహదారిలో లైట్లు ఏర్పాటు చేయాలని కమిటీ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
అదే విధంగా శాశ్వతంగా ఉపయోగపడే వాటర్ ట్యాంక్ నిర్మించాలని, జంగుబాయి ఆలయ ప్రాంగణంలో అక్రమంగా సాగు చేస్తున్న భూమిని స్వాధీనం చేసుకొని ఆలయం పేరిట పట్టా చేసి ఇవ్వాలని కమిటీ నాయకులు వేడుకున్నారు. గతంలో మంజూరైన కమ్యూటీ హాల్, షెడ్లను వెంటనే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కలెక్టర్, పీవో సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు బాధ్యత అప్పగించారు. అనంతరం కలెక్టర్, పీవో జంగుబాయి జాతరకు సంబంధించిన పోస్టర్లను కమిటీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీడీ రమాదేవి, ఏపీవో మెస్రం మనోహర్, డీఎస్పీ కరుణకర్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్, డీపీవో భిక్షపతి గౌడ్, ఎంపీడీవో అమ్జద్‌పాషా, డిప్యూటీ తహసీల్దార్ సంతోశ్‌కుమార్, సీఐ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు మతీన్, రాకేశ్, ఏసీఎంవో ఉద్దవ్, కమిటీ నాయకులు సలాం శ్యాంరావ్, మరప బాజీరావ్, పుర్క బాపురావ్, ఆత్రం లక్ష్మణ్‌రావ్, రాయిసిడాం జంగు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.