నస్పూర్, జూన్ 16 : ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన కుమార్ దీపక్ ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా నస్పూర్‌లోని కలెక్టరేట్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని అన్నారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కుమార్ దీపక్‌కు అదనపు కలెక్టర్లు రాహుల్, సబావత్ మోతీలాల్, ఆర్డీవో రాములు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన కుమార్ దీపక్ ఉద్యోగోన్నతిపై కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1 ఫిబ్రవరి 2023 నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన బదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.