Nirmal | కుభీర్, నవంబర్ 17 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలేగాం గ్రామంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు గాను, రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకుగాను మాలేగాం దాని చుట్టుపక్కల 15 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా సుమారు రూ. 1.10 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించేందుకు గాను నిధులను మంజూరు చేసి పనులను సైతం ప్రారంభించింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టకముందే 90 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ సబ్ స్టేషన్‌ను ప్రారంభించకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు ప్రకృతి కన్నెర్రతో సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక తీవ్ర నష్టాల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ యాసంగిలోనైనా కొంతమేర నష్టాలను పూడ్చుకుందామని భావించి ఈపాటికి మొక్కజొన్న, సెనగ, పసుపు పంటలు సాగు చేశారు.
“అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అన్న చందంగా యాసంగి పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి మారింది. పట్టింపు లేని పాలకులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం, ముందు చూపులేని విద్యుత్ శాఖ అధికారుల కారణంగా రైతులు కనీసం అర ఎకరానికి కూడా నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. అనధికారిక విద్యుత్ కోతలు, తరచూ ఎల్సీ ఇవ్వడం, మరమ్మత్తుల పేరిట విద్యుత్ సరఫరాలో అంతరాయం, ముఖ్యంగా లోవోల్టేజీ సమస్య రైతులను వేధిస్తోంది. మాలేగాంతో పాటు చుట్టుపక్కల 15 గ్రామాలకు విద్యుత్ సమస్య వెంటాడడంతో సాగుచేసిన పంటలు ఎండిపోతాయన్న భయం రైతులను పట్టిపీడిస్తోంది. సబ్ స్టేషన్ ప్రారంభించమని కుభీర్ ఏఈతో పాటు సబ్ డివిజనల్ విద్యుత్ శాఖ అధికారులకు రెండేళ్ల నుండి రైతులు మొర పెట్టుకుంటున్నప్పటికీ పట్టించుకున్న నాధుడు లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది యాసంగిలో విద్యుత్ సమస్యలు తలెత్తి కుంటాల మండలంలోని ఓలా ఇతర సబ్ స్టేషన్ల నుండి ప్రత్యేక లైన్ వేసి మండల రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. ఈ ఏడు వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో శనగతోపాటు మొక్కజొన్న, నువ్వులు తదితర పంటలు సాగు చేశారు. గతేడాది యాసంగి కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ముందే సాగు చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలలో దండోరా వేయిస్తే తాము ఎందుకు పంటలను సాగు చేసుకునే వారమని సాగు చేసుకున్న తర్వాత ఈ బాధలు పెడుతున్నారని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు.
జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు స్పందించి వెంటనే మాలగంలో నిర్మించిన సబ్ స్టేషన్‌ను ప్రారంభించి రైతులకు నాణ్యమైన, కోతలు లేని లోవోల్టేజ్ లేకుండా, విద్యుత్ సరఫరా చేయాలని లేని పక్షంలో కుబీర్ సబ్ స్టేషన్ ముందు రైతులతో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.