జైనూర్, మే 12 : జైనూర్ మండలం చింతకర్ర గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ నాయక్ తండా, చింతకర్ర గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి సరఫరా కావాల్సిన తాగునీరు గత కొన్ని రోజులుగా అందకపోవడంతో ప్రజలు నీటి కోసం అల్లాడి పోతున్నారు. అసలే నీటి సరఫరా లేదదంటే.. గ్రామంలోని మోటార్ కూడా కాలిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఐదు రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బిందెలతో దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండుటెండల్లో బిందెడు నీటి కోసం గ్రామస్తులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. తాగునీటి సమస్యపై గ్రామపంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలిపోయిన మోటార్‌కు మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మోటార్‌కు మరమ్మతులు చేసి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కిషన్ నాయక్ తండా, చింతకర్ర గ్రామాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.