cheetah cubs : మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో నాలుగు చీతా కూనలు మరణించాయి. మంగళవారం ఉదయం వీటి కళేబరాల్ని అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 4 కూన పిల్లలు కేజీపీ 12 అనే ఆడ చీతాకు చెందినవి. ఇవి గత నెల 11న జన్మించాయి. ఇవి నాలుగూ సోమవారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మంగళవారం పర్యవేక్షకులు ఈ ప్రాంతంలో సాధరణ మానిటరింగ్ నిర్వహిస్తుండగా, నాలుగు కూనల కళేబరాలు కనిపించాయి. వీటిని ఒక జంతువు చంపి తిన్నట్లు ప్రాథమికంగా గర్తించారు. ఈ నాలుగు కళేబరాల్ని వాటి నివాస స్థలం పక్కనే గుర్తించారు. ఈ నాలుగింటి తల్లి క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, నాలుగు కూనలు మరణించిన నేపథ్యంలో ఈ తల్లి చీతా రక్షణ కోసం అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ఈ చీతాపై మళ్లీ దాడి జరగకుండా భద్రంగా గమనిస్తున్నారు. ఈ చీతా ప్రబర్తన సాధారణంగానే ఉందని అధికారులు అంటున్నారు. నాలుగు చీతాల కళేబరాల్ని అధికారులు పోస్టుమార్టం కోసం తరలించారు. వీటి మృతికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.
వేరే ఏదైనా దాడి చేసే జంతువు ఉందేమో అని గమనిస్తున్నారు. మరో దాడి జరగకుండా చూస్తున్నారు. వరుసగా వివిధ కారణాలతో చీతాలు మరణిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ చీతాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కూనో నేషనల్ పార్క్ పరిధిలో 50 చీతాలున్నాయి. వీటిలో 33 ఇండియాలోనే జన్మించాయి. మరో మూడు చీతాలు గాంధీ సాగర్ అభయారణ్యంలో ఉన్నాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 53 చీతాలున్నాయి.