కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మహిళా సంఘాలు జిల్లా స్థాయి సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంఘాలకు రుణాలు అందిస్తుందని పేర్కొన్నారు.
వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం దిశగా పయనించాలని సూచించారు. స్త్రీనిధి పథకం కింద ఇచ్చిన రుణాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఒమిక్రాన్ హెచ్చరికల నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లాలోని అన్ని మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.