కౌటాల, మే 28: కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఒడ్డున ప్రాజెక్టు మోసాలపై చర్చకు రావాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాల్‌ను స్వీకరించారు. బుధవారం ఉదయం కాగజ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి కౌటాల మండలం తుమ్మిడి వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ పోలీసులు భారీగా మోహరించి కోనప్పను హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణారావు నాయకులతో కలిసి కౌటాల నుంచి తుమ్మిడి హెట్టి వద్దకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సమయంలో కౌటాల సీఐ ముత్యం రమేశ్ అడ్డుకున్నారు.
బీజేపీ నాయకులు ప్రాణహిత వద్దకు ఎలా వెళ్తారని కృష్ణారావు ప్రశ్నించగా.. ఎవరిని కూడా అక్కడికి వెళ్లనివ్వమని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని సీఐ కోనేరు కృష్ణారావుకు వివరించడంతో ఆయన వెనుతిరిగి కౌటాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. బీజేపీ మండల అధ్యక్షుడు కుంచాల విజయ్ పార్టీ కార్యకర్తలతో కలిసి తుమ్మిడి హెటి వద్ద గల ప్రాణహిత నది వద్ద కార్యకర్తలతో చేరుకొని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తామంతా ఇక్కడికి చేరుకున్నామని తెలిపారు. పదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప ప్రాజెక్టు విషయంలో చేసింది ఏమి లేదని విమర్శించారు. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే హరీశ్ బాబు సిద్ధంగా ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడికి రాలేకపోయారన్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న కోనప్ప కార్యకర్తలు ఎమ్మెల్యే హరీశ్ బాబు వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ ప్రాణహిత నదిపై బహిరంగ చర్చకు మాజీ ఎమ్మెల్యే కోనప్ప రానవసరం లేదని తాము దేనికైనా సమాధానం ఇచ్చే అంత ధైర్యం మా దగ్గర ఉందని దమ్ముంటే ఎమ్మెల్యే హరీశ్ బాబు రావాలని సవాల్ విసిరారు.
అనంతరం మండల కేంద్రంలోని కోనప్ప నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి తాజా ఎమ్మెల్యే హరీశ్ బాబు ఏడాదిన్నర పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయకపోగా నిత్యం ప్రజల కోసం సేవ చేసే, ప్రజల మధ్యలో ఉండే కోనేరు కోనప్ప అతని కుటుంబాన్ని విమర్శించే స్థాయి హరీష్ బాబుది కాదని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమరం మాంతయ్య అన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మండల కేంద్రంలో ఇటు కోనప్ప మద్దతుదారులు, అటు బీజేపీ కార్యకర్తలు బయటకు రావడంతో ఇరు వర్గాలు ఎదురు పడకుండా కౌటాల సీఐ ముత్యం రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.