తాండూర్, జూన్ 27 : రైతు బంధు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమచేయడం, వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరందుకున్నాయి. తాండూరు మండలంలో పత్తి పంటను అధికంగా సాగు చేస్తారు. ఈ సారి 13 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే 4 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. వారం నుంచి వర్షాలు కురియడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇప్పటికే పొలాలు, చేన్లను సిద్ధం చేసుకున్న రైతులు పలు చోట్ల విత్తనాలు సైతం వేసుకున్నారు. రెండు రోజులుగా మండలం వ్యాప్తంగా సాగు పనులు ముమ్మరంగా కొనసాగున్నాయి. దుక్కి దున్నడం, విత్తనాలు విత్తుకోవడం వంటి పనులు చేస్తున్నారు. తాండూరు మండలంలో అచ్చలాపూర్, రేచిని, మాదారం, అబ్బాపూర్, బెజ్జాలతో ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.
అన్నదాతల హర్షం..
లక్షెట్టిపేట రూరల్, జూన్ 27 : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులను రైతులు ప్రారంభించారు. లక్షెట్టిపేట మండలంలో మొత్తం 24,500 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయి. ఇందులో 7 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతాయి. ఇప్పటి వరకు 5 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఏరువాక పౌర్ణమి నాటి నుంచి విత్తనాలు విత్తితే మంచి దిగుబడి వస్తుందని ఇక్కడి రైతుల నమ్మకం. దీంతో మూడు రోజుల నుంచి దుక్కులు దున్నడం, అచ్చుకొట్టడం, విత్తనాలు విత్తే పనుల్లో కూలీలు, రైతులు నిమగ్నమయ్యారు.