ప్రతి మండలంలోని మూడు కేంద్రాల్లో ఏర్పాటుకు చర్యలు
త్వరలో అందుబాటులోకి ఇంటర్నెట్, స్మార్ట్ టీవీలు
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రయోజనం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ) :మారుతున్న కాలానికనుగుణంగా ప్రభుత్వం అంగన్వాడీలను ఆధునీకరిస్తున్నది. ఈ మేరకు ప్రతి మండలంలోని మూడు కేంద్రాల్లో డిజిటలైజేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. త్వరలో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకురానుండగా, విద్యార్థులకు మెరుగైన విద్య అందడంతోపాటు గర్భిణులు, బాలింతల కోసం వివిధ కార్యక్రమాలు ప్రసారం చేయనున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో 834 అంగన్వాడీ కేంద్రా లు, 139 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం పోషణ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో న్యూట్రీగార్డెన్లను ఏర్పాటు చేస్తున్నా రు. ఇక ఇదిలా ఉంటే అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో డిజిటలైజేషన్ను ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఈ ప్రక్రియతో గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రతి మండలంలోని మూడు అంగన్వాడీ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించనుండగా, సాంకేతికతతో పాటు ఆధునిక సమాచారం అందుబాటులోకి రానున్నది. ఇంటర్నెట్ సదుపాయంతో పాటు స్మార్ట్ టీవీని కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా 21,567 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. ఆటపాటలతో కూడిన విద్యతో పాటు స్మార్ట్ టీవీల్లో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. వీరికోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రసారం చేయడంతో పాటు గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ ఇటీవల పరిశీలించి, అందుకు కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
డిజిటలైజేషన్తో అనేక ప్రయోజనాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. అంగన్వాడీల్లో డిజిటలైజేషన్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆధునిక సమాచారం అందుబాటులోకి వస్తుంది. పిల్లలు చదువులపై ఆసక్తి పెంచుకుంటారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది.
45 కేంద్రాల్లో డిజిటలైజేషన్
అంగన్వాడీ కేంద్రాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం బాలింతలు, గర్భిణులు, పిల్లల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుస్తుంది. జిల్లాలో 45 కేంద్రాల్లో డిజిటలైజేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.