నిర్మల్ అర్బన్, నవంబర్ 6 : ప్రభుత్వ దవాఖానలపై ఉన్న అపోహలను స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సర్కారు తొలగించే చర్యలు చేపట్టింది. అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యాధునిక సదుపాయాలు కల్పించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేలా మెరుగులు దిద్దింది. దీంతో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. నిర్మల్ జిల్లా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించారు. ఈ మేరకు 250 పడకల భవన నిర్మాణంతో పాటు, అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు రూ.48.83 కోట్లు మంజూరు చేయించారు. మంత్రి అల్లోల ఇప్పటికే దవాఖానలో డయాలసిస్, టీ డయాగ్నోస్టిక్, ఆర్టీపీసీఆర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. రోగులకు ప్రాణాపాయ స్థితిలో అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు పూర్తయితే మరిన్ని సేవలు అందనున్నాయి.
పెరుగనున్న సేవలు..
రాష్ట్ర సర్కారు మంజూరు చేసిన రూ.48.83 కోట్లతో 250 పడకలుగా అభివృద్ధి చెందడంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. దవాఖానలో సర్జికల్, ఆర్థో, ఆరోగ్య శ్రీ తోపాటు కార్డియాలజీ, యూ రాలజీ సేవలు తప్ప అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. 25 మంది వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉం టున్నారు. అత్యవసర సేవల కోసం బెడ్లు అందుబాటులో ఉండగా, ఆక్సిజన్, వెంటిలేటర్ 3, ఈ సీజీ, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, డిజిటల్ ఎక్స్రే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులో ఉన్నవి..
జిల్లా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2018, జనవరి 2న మొదటగా 5 డయాలసిస్ బెడ్లను ఏర్పాటు చేయించారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో అదనంగా (2020, డిసెంబర్ 12న) 5 బెడ్లను మంజూరు చేయించారు. ఇప్పటి వరకు 219 మందికి డయాలసిస్ చేశారు. జిల్లాలో 78 మందికి ఉచితంగా సేవలు అందుతున్నాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. పేద ప్రజలకు ఆర్థిక భారం కావద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత టీ డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ల్యాబ్లో ఉచితంగా 57 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల మందికి పరీక్షలు చేశారు. అలాగే రోగులు ప్రాణవాయువు అందక చనిపోవద్దన్న ఉద్దేశంతో దవాఖానలోని కొవిడ్ బాధితులతో పాటు మామూలు రోగుల కోసం 1000 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. అలాగే కరోనా నిర్ధారణ కోసం రూ.1.50 కోట్లతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ను ఆగస్టు 15న మంత్రి అల్లోల ప్రారంభించారు. ఇప్పటి వరకు 300 మందికి టెస్టులు చేశారు.
సర్కారు, మంత్రికి జిల్లా ప్రజల కృతజ్ఞతలు..
నిర్మల్ జిల్లా దవాఖానకు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిత్యం దాదాపు 300 మంది వస్తున్నారు. 100 పడకలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అవి సరిపోవడం లేదు. తగిన సదుపాయాలు కల్పించాలని, వైద్య సిబ్బందిని, బెడ్ల సంఖ్యను పెంచాలని మంత్రి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 100 పడకలకు అదనంగా 150 పడకల భవన నిర్మాణానికి రూ.39.65 కోట్లు, అత్యాధునిక వైద్య పరికరాలకు రూ.9.18 కోట్లు మం జూరు చేయించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పను లు ప్రారంభించనున్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ కానుండగా, నూతనంగా అదనపు సిబ్బంది, వైద్యులు నియామకం కానున్నా రు. దవాఖాన అభివృద్ధికి కృషిచేస్తున్న సర్కారుకు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మెరుగైన వైద్యం అందించేందుకే..
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా దవాఖానకు ప్రభుత్వం రూ.48.83 కోట్లు మంజూరు చేసింది. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా 100 పడకలుగా ఉన్న దవాఖానను 250 పడకలు చేసి, వైద్య పరికరాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి కోరాం. ఈ మేరకు దవాఖాన అభివృద్ధి పనులు, వైద్య పరికరాల కోసం నిధులు మంజూరుచేశారు. దీంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. త్వరలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.