మరో నెల రోజుల్లో పంట చేతికి.. l14 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
సేకరణకు అధికారుల పక్కా ప్రణాళిక lరైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు
గ్రామాల వారీగా రైతులకు టోకెన్లు ఇచ్చేందుకు కసరత్తు
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) :జిల్లాలో పత్తి కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ యేడాది అత్యధికంగా 3.23 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశమున్నది. 13 నుంచి 14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, ఆ మేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయగా, అధికారులు నిర్ధిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గ్రామాల వారీగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి కర్షకులకు టోకెన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో సుమారు 4 లక్షల 51 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో అత్యధికంగా 3 లక్షల 23 వేల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. మరో నెల రోజుల్లో పత్తి పంట చేతికి రానున్నది. ఈ ఏడాది 13 నుంచి 14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఈ మేరకు కొనుగోళ్లు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం పత్తికి రూ. 6 ,025 మద్దతు ధర నిర్ణయించింది.
రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు..
రైతులు పంట విక్రయాల సమయంలో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గ్రామాల వారీగా రైతుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు టోకెన్లను అందజేసి సూచించిన రోజుల్లో వారికి కేటాయించిన ప్రాంతంలో పంటను అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ పెరగకుండా ఉంటుంది.
కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు..
పంట కొనుగోళ్లపై అధికారులు దృష్టిసారించారు. మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, రవాణా, ఫైర్, లీగల్ మెట్రాలజీ అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లుల యజమానులు సమన్వయంతో పనిచేయనున్నారు. జిల్లాలో 15 జిన్నింగ్ మి ల్లులు ఉన్నాయి. కొనుగోళ్ల ప్రారంభానికి ముందే లీగల్ మె ట్రాలజీ అధికారులు మిల్లును సందర్శించి ఎలక్ట్రానిక్ కాం టాలు, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలను పరిశీలించనున్నారు. వారు ధ్రువీకరించిన తరువాతనే మిల్లులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి సేఫ్టీ విషయాలను పరిశీలిస్తారు. పత్తి నిల్వలకు అవసరమైన గోదాంలను ఏర్పాటుచేస్తారు.
దిగుబడిపై భారీ అంచనాలు..
ఈ ఏడాది జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడిపై అధికారులు భారీ అంచనాలు వేస్తున్నారు. గతేడాది దాదాపు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా, ఈ ఏడాది 13 నుంచి 14 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. అనుకూలంగా వర్షాలు కురుస్తుండడంతో పాటు ఎక్కువగానే దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.