
ఎదులాపురం,అక్టోబర్1: వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగానే వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాల్లోని తగాదాలు, సమస్యలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారికి పిటిషన్ అందించాలన్నారు. ఆదిలాబాద్ , ఉట్నూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధిలో ఉన్న కేసులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు కలెక్టర్ సూచించారు. జిల్లా స్థాయి ట్రిబ్యునల్లో సీనియర్ సిటిజన్లను సభ్యులుగా చేర్చడంపై పరిశీలిస్తామని తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. అనంతరం ఎనిమిది మంది వృద్ధులను కలెక్టర్ సత్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాస్తల సుధాకర్ , ఆర్డీవో రాజేశ్వర్, వయోవృద్ధుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.