నేరడిగొండ, జూలై 31 : పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రభుత్వం గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకుంటున్నది. దీంతో ప్రకృతి వనాలు హరిత నిలయాలకు చిరునామాగా మారాయి. చిన్నారులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలు గ్రామ పంచాయతీలు చూస్తున్నాయి.
పచ్చదనం ఉట్టిపడేలా
మండలంలో 32 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ కేటాయించిన 20 గుంటల నుంచి ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో వనానికి ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలు కేటాయించారు. వీటిలో వనం ఏర్పాటుకు రూ.3 లక్షలు సామగ్రికి, మొక్కల కొనుగోలు, కూలీల వేతనాలకు మరో రూ.2 లక్షలు వెచ్చించారు. దట్టమైన అటవీ ప్రాంతం ఏర్పాటుకు పలు రకాల మొక్కలు నాటించారు. ప్రకృతి వనం చుట్టూ పెద్ద సైజు, మధ్యలో వేప, జామ, కానుగ, గుల్మోహర్, సీమతంగేడు, మధ్యలో పలు రకాల పూల మొక్కలు నాటించారు. ఇవి ఏపుగా పెరిగి పచ్చదనం ఉట్టిపడుతూ కళకళలాడుతున్నాయి. ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు సౌకర్యంగా ఉండేలా నడకదారి ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధుల ఆధారంగా పిల్లలు ఆడుకోవడానికి క్రీడా సామగ్రిని నెలకొల్పారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను వనసంరక్షణ సేవలకు అప్పగించారు. కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. మొక్కలు, ప్రకృతి వనాల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు నిత్యం సాయంత్రం ప్రకృతి వనాలకు వెళ్తూ ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు సేదదీరుతూ మానసికోల్లాసం పొందుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో నిండిపోయాయి. ప్రకృతి వనాల్లో పలు రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, క్రీడా సామగ్రి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దీంతో స్వచ్ఛమైన గాలి లభించడంతో ఉపశమనం పొంది ఆరోగ్యంగా జీవించడానికి వీలుంటుంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించాం. -శోభన, ఎంపీవో, నేరడిగొండ
అభివృద్ధితో సంతోషం
పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. గతంలో ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరగలేదు. పల్లె ప్రకృతి వనాలు, ఇతర అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అభివృద్ధితో అందరూ సంతోషంగా ఉన్నారు.
-సోలంకి గీత, సర్పంచ్, కిష్టాపూర్