కుభీర్, జూలై 31 : క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. గ్రామగ్రామాన చేపట్టిన తెలంగాణ గ్రామీణ క్రీడా మైదానాల పనులు కుభీర్ మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. కుభీర్ మండలంలో 41 గ్రామ పంచాయతీలు 35 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 41 క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంకా 31 నిర్మాణ దశలో ఉన్నాయి.
రూ.4.60 లక్షలతో క్రీడామైదానం
ఒక్కో మైదానం ఏర్పాటుకు రూ.3.50 లక్షల నుంచి రూ.4.60 లక్షల వరకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది. అంతేకాకుండా అనుబంధ గ్రామాల్లో మైదానాలు నిర్మిస్తుండడం విశేషం. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, వ్యాయామం చేసే పరికరాలు, గ్రామీణ యువత ఆడుకునేందుకు అనువైన విధంగా మైదానాలు నిర్మిస్తున్నారు. వాలీబాల్, నెట్ బ్యాడ్మింటన్ క్రీడలకు సామగ్రి ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతిభను చాటుకునేందుకు దోహదం
గ్రామాల్లో యువకులు, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలు ప్రదర్శించుకోవడానికి క్రీడామైదానాలు ఉపకరిస్తాయి. పల్లెల్లో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ ఓ వేదిక లేకపోవడంతో ముందుకు వెళ్లలేకపోయారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి పల్లెలో క్రీడా మైదానం ఏర్పాటు అవుతుంది. దీంతో యువతకు మంచి అవకాశం.
-ఆకుల గంగాధర్, సర్పంచ్, పార్డి(కే)
క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది
పల్లెల్లో క్రీడామైదానాలు నిర్మిస్తుండడంతో గ్రామీణ వాసులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతున్నది. ఇప్పటి వరకు పండుగల వేళ కూడా వాలీబాల్, క్రికెట్ ఆడేందుకు మైదానం లేక వీలుండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం గ్రామగ్రామాన మైదానాలు అభివృద్ధి చేయడంతో యువత పోటీల్లో తమ ప్రతిభను చాటేందుకు మంచి అవకాశం దొరికింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైదానాలు నిర్మిస్తున్న కేసీఆర్ సర్కారుకు కృతజ్ఞతలు.
-దత్తు పటేల్, యువకుడు, నిగ్వ
ప్రతి మైదానంలో సౌకర్యాలు
మండలంలో స్థలం ఉన్న ప్రతి గ్రామంలో క్రీడామైదానం నిర్మిస్తున్నాం. మైదానంలో సకల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రెండో విడుత జాబితా గ్రామాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించాం. కొన్ని నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. మరికొన్ని మైదానాల్లో పనులు సాగుతున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల క్రీడాకారులు, యువత వీటిని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటాలి.
-తూం లక్ష్మి, ఎంపీపీ, కుభీర్