మంచిర్యాల, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతన్‌పల్లిలో 250 ఎకరాల్లో కళ్లు చెదిరే వసతులతో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. అక్టోబర్ 1న రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గాంధారీ వనంలో 250 ఎకరాల్లో రూ.50 కోట్లతో సర్వాంగా సుందరంగా, సకల వసతులతో అభివృద్ధి చేయనున్న ఈ పార్కుకు సంబంధించిన వీడియోను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పార్క్ మెయిన్ ఎంట్రన్స్ మొదలు, ఎంట్రెన్స్ ఆర్చ్, చార్బాగ్ గార్డెన్, ఫుడ్ కోర్ట్స్, కాటేజీలు, కన్వెక్షన్ సెంటర్, క్రాఫ్ట్ స్టాల్స్, ఆర్టిస్టిక్ సెంటర్, వర్క్ షాప్, వాటర్ ఫౌంటేన్స్, ఆడిటోరియం, బోటింగ్, ఫెస్టివల్ జోన్, విలేజ్ మ్యూజియం, వాటర్ థీమ్ పార్క్, రెయిన్ డ్యాన్స్, వాటర్ ైస్లెడ్స్, వాటర్ రైడ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా తదితరాలను కండ్లకు కట్టినట్లు ఈ వీడియోలో చూపించారు. “ చెన్నూర్ నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 250 ఎకరాల్లో కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు ఏర్పాటు చేయనున్నాం, మొదటి, రెండో విడుతల్లో కలిపి మొత్తం రూ.50 కోట్లతో నిర్మించనున్న ఈ పార్కు పనులకు అక్టోబర్ 1న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు” అని బాల్క సుమన్ పేర్కొన్నారు.