ఆదిలాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు ఆయకట్టు 24 వేలు కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 14 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. మిగతా 10 వేల ఎకరాల ఆయకట్టును రైతులు నష్టపోయేవారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినా ఉపయోగపడేది కాదు. ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సాత్నాల ప్రాజెక్టును ఆధునికీకరించి, పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందేలా చర్యలు చేపట్టింది. ఫలితంగా ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 286.50 మీటర్లు కాగా.. 286.15 మీటర్ల వరకు నీరు ఉంది. వానకాలంలో వర్షపు నీటితో ప్రాజెక్టు నిండి వర్షపు నీటితో కళకళలాడేది. చెరువులు మత్తడి దుంకేవి. సాగునీటి, బోరు బావుల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
చివరి ఆయకట్టుకు నీరు
కేసీఆర్ ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసి ప్రాజెక్టును ఆధునికీకరించింది. లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెరిగేలా పనులు చేపట్టింది. గతంలో లక్ష్మీపూర్ రిజర్వాయర్ నుంచి చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదు. కాలువల లీకేజీలు, మిగతా నిర్మాణాలు సరిగా లేకపోవడంతో నీరు వృథాగా పోయేది. ఫలితంగా సగానికి పైగా ఆయకట్టుకు నీరు అందక పంటలు నష్టపోయేవారు. కేసీఆర్ ప్రభుత్వం కాలువలు, తూముల మరమ్మతులు, లైనింగ్, వాల్స్, డ్రాప్‌లు పూర్తి చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందుతున్నది. దీంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు.
రెండు పంటలకు సాగునీరు..
నేను వానకాలంలో రెండు ఎకరాల్లో పత్తి పంట వేశా. కుడి కాలువ ద్వారా నీరు అందేది. యాసంగిలో శనగ వేశా. కాలువ ద్వారా ఈ పంటకు నీరు అందుతున్నది. కేసీఆర్ సర్కారు సాత్నాల ప్రాజెక్టు కింద లక్ష్మీపూర్ రిజర్వాయర్ నిర్మించడంతో మాలాంటి రైతులకు మేలు జరుగుతున్నది. రెండు పంటలు వేసుకో గలుతున్నాం.
– అశోక్, రైతు, పెండల్వాడ, జైనథ్ మండలం
కేసీఆర్ చలువే..
ఉమ్మడి రాష్ట్రంలో సాత్నాల ప్రాజెక్టు నుంచి కాలువలు సక్రమంగా లేక సాగు నీరు అందేది కాదు. నీరంతా వృథాగా పోయేది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతు చేపట్టడంతో 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతున్నది. వానకాలం, యాసంగి పంటలకు అవసరమైన సమయంలో నీరు అందుతున్నది. వానకాలంలో పత్తి, సోయాబిన్.. యాసంగిలో శనగ, జొన్న, పల్లి పండిస్తున్నాం. ఇదంతా కూడా కేసీఆర్ చలువే.
– సతీష్, రైతు, సవర్గాం, జైనథ్ మండలం