మంచిర్యాల అర్బన్, జనవరి 16 : కేసీఆర్ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికతీతతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధువంటి పథకాలు తీసుకొచ్చి బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మార్చింది.
ఇక్కడి రైతులతో పాటు కూలీలకు చేతినిండా పనిదొరుకుతుండగా, ఇతర రాష్ర్టాల వారికి సైతం ఉపాధి చూపినైట్లెంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కూలీలు వరి, పత్తి చేలల్లో పనులు చేస్తూ సంపాదించుకుంటున్నారు. మరోవైపు రైస్ మిల్లులు, భవన నిర్మాణ రంగాల్లో సైతం పని చేస్తున్నారు.
ఒకరోజులో స్థానికులు మూడు నుంచి నాలుగెకరాల్లో నాటు వేస్తుండగా, అదే వలస కూలీలు మాత్రం ఆరు నుంచి ఎనిమిది ఎకరాల్లో నారు పీకి, నాట్లు వేస్తున్నారు. మరోవైపు ఎకరంలో నాటు వేయాలంటే స్థానికులు గంపగుత్తగా రూ. 5 వేలు తీసుకుంటారు. దీనికి అదనంగా పీకిన నారును అందించేందుకు మరో ఇద్దరు అవసరం. వీరికి అదనంగా మరో రూ. 2 వేలు ఖర్చవుతాయి.
ఈ లెక్కన ఎకరానికి రూ. 7 వేల దాకా ఖర్చవుతుంది. అదే వలస కూలీలతో నాటు వేయిస్తే వ్యయం తగ్గుతుంది. నారు పీకడం, కట్టలు కట్టడం, నాటు వేసే వారికి పంచడం, నాటు వేయడం అంతా కలిపి మొత్తంగా ఎకరానికి రూ. 4500 తీసుకుంటున్నారు. దీంతో రైతుకు ఎకరానికి దాదాపు రూ. 2500 ఆదా అవుతున్నాయి. దీంతో స్థానిక రైతులు వలస కూలీలతో నాటు వేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మాది యూపీలోని పిలిబిత్ జిల్లా. నాలుగేండ్ల సంది తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నం. ఒక్క మా జిల్లా నుంచే 400 మందికి పైగా వచ్చినం. మంచిర్యాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో వరి, పత్తి తీత పనులు చేస్తున్నం. మాకు ఓ ఏజెంటు ఉన్నడు. ఆయన ఎక్కడ పని ఉంటే అక్కడికి పంపిస్తడు.
మా రాష్ట్రంలో రోజంతా పని చేస్తే రూ. 400 నుంచి రూ. 600 దాకా ఇస్తరు. అదే తెలంగాణలో ఒక్కొక్కరికీ దాదాపు రూ. 1200పైనే కూలి పడుతుంది. అందుకే మావోళ్లంతా తెలంగాణకు లైను కడుతున్నరు. సీజన్ల నెలన్నర నుంచి రెండు నెలలు దాకా పని దొరికితే చాలు. మళ్లీ ఇంటికి పోయినంక చిన్న చిన్న పనులు చేసుకుంటం. మంచిర్యాల జిల్లాకు 14 మందిమి ఒక టీమ్‌గా వచ్చినం. – కార్తిక్, పిలిబిత్ జిల్లా, ఉత్తరప్రదేశ్
మేము ఇక్కడకు వచ్చి న్లైతంది. మాకు చేతి నిండా పని దొరుకుతుంది. రైతులు మా వద్దకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలతో వచ్చి వారి పొలాల వద్దకు తీసుకుపోతున్నరు. రోజుకు ఆరెకరాలకుపైగా నాట్లు వేస్తున్నం. ఇప్పటి వరకు దాదాపు 250 ఎకరాల దాకా నాట్లు వేసినం. మూరెడుకు మూడుచోట్ల పిలకలు నాటుతున్నం. ఇలా వేయడం వల్ల పంట దిగుబడి బాగా వస్తది. దీంతోనే ఒకసారి నాటు వేయించుకున్న రైతులు మళ్లా మమ్ముల్నే కావాలని అడుగుతున్నరు. రైతులు మంచిగుంటేనే మాలాంటి కూలీలకు ఇన్ని డబ్బులు దొరుకుతయి. మా రాష్ట్రంలో పనులు దొరకడం కష్టం. ఇక్కడ చేతి నిండా పనే. ఏడాదికి రెండుసార్లు ఇక్కడికొస్తే ఏడాదంతా గడపొచ్చు.
– తరుణ్, పిలిబిత్ జిల్లా, ఉత్తరప్రదేశ్
నాకు ఆరెకరాల భూమి ఉంది. దీనికితోడు మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకున్న. ఇక్కడ నాటు వేసేందుకు కూలీలు దొరకలే. అందుకే వలస కూలీలను ఇక్కడికి రప్పించిన. మొత్తం 22 ఎకరాలు వేయించుకున్న. నా కోసం తీసుకొచ్చుకున్న లేబర్లు మా ఊరిలో 250 ఎకరాల్లో నాట్లు వేసిన్రు. సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అయినయ్. ఇక నుంచి ప్రతి సీజన్లో వీరితోనే నాట్లు వేయిస్తా.
– గంగాధర్‌రెడ్డి,రాజేశ్వర్‌రావుపల్లె, హాజీపూర్