ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిద్దామని, విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. గురువారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహిం చారు.
27న సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకోవాలని కోరారు. సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ, ఇతర వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వహించాలని, సభకు తరలే ముందు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన సూచించారు.
రజతోత్సవ సభ తర్వాత కొత్త సభ్యత్వాలు ఉంటాయని, కార్యకర్తల కు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, కమిటీల ఎన్నిక ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
– మంచిర్యాల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)