తాండూర్ : గౌడ కులస్తుల జీవనం రోజు రోజుకు అధ్వాన్నంగా మారుతుందని మోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసరపు మొండిగౌడ్ ( Mondi Goud ) అన్నారు. ప్రభుత్వం గీతా కార్మికులకు ఇస్తామన్న కాటమయ్య కిట్లు (Katamaya kits ) అందక పోవడం వల్ల తరచూ గీత కార్మికులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. గౌడ సంఘం నాయకులతో కలిసి తాండూర్ ఐబీలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
శనివారం బెల్లంపల్లి మండలంలోని మాలాగురిజాల గ్రామంలో పోతుగంటి శంకర్ గౌడ్ అనే గీతా కార్మికుడు చెట్టు ఎక్కి కిందకు దిగే క్రమంలో కాలుజారి బురదలో పడి మృతి చెందాడని వివరించారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన గీత కార్మికులకు వెంటనే కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని, చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పెరుమండ్ల భాస్కర్ గౌడ్, జిల్లా కార్యదర్శి గాజుల రమేష్, గౌడ్, యువ నాయకులు తాళ్లపల్లి సృజన్ గౌడ్ ఉన్నారు.