కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యను అందిస్తుంటే.. ప్రతిపక్ష నాయకులు విధ్వంసం సృ ష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లోని శ్వేత హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు బీసీలు వె నుకబడి పోలేదని, విద్యను అందించక వెనక్కినెట్టి వేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో కేవలం 19 బీసీ గురుకులాల్లో 7,500 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసించే వారని, 70 ఏండ్ల స్వాతంత్య్రంలో కేవలం 19 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏర్పడిన ఆరేండ్లలో సీఎం కేసీఆర్ వాటిని 262కు పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ గురుకులాల్లో 1,65,160 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు.
బీసీ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై తమ ప్రభుత్వం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. బీసీ సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన భోజనం, వసతితో పాటు బ్లాం కెట్లు, జాకెట్స్, ట్రాక్ సూట్స్, కిచెన్ యుటెన్సియల్స్తో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. వానకాలం, చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చేసిన విజ్ణప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే రూ.95 కోట్లు మంజూరు చేశారని, ఈ సంవత్సరమే అన్ని గురుకులాల్లో సోలార్ వాటర్ హీటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
గురుకులాల్లో నాణ్యమైన ఇంగ్లిష్ విద్యతోపాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ఇంగ్లిష్ అద్భుతంగా మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క బీసీ డిగ్రీ కళాశాల కూడా లేదని, తెలంగాణ వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ బీసీ విద్యార్థుల కోసం ఒకటి ఏర్పా టు చేశారని గుర్తు చేశారు. 262 గురుకులాల్లో కొన్ని ఇంటర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయని, బీసీ గురుకులాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలోనే కొత్తగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారని తెలిపారు. దేశ చరిత్రలో ఏక కాలంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో మంజూరు చేయలేదన్నారు.
గురుకులాల్లో 5, 6, 7వ తరగతుల అడ్మిషన్లకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. మహిళా డిగ్రీ కళాశాలలో ఇప్పటి వరకు 1,200 మంది చదువుతున్నారని, కొత్తగా మంజూరైన 15 కళాశాలల్లో ఇప్పుడు 4,800 మందికి అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 310 బీసీ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు విధ్వంసాలను పెంచి పోషిస్తుంటే తాము మాత్రం విద్యను పెంచి పోషిస్తున్నామని మండిపడ్డారు. గురుకులాలు, డిగ్రీ కళాశాలలు ఎక్కడెక్కడ స్థాపించాలో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్లో ఒక గురుకులం, డిగ్రీ కళాశాలను తప్పని సరిగా ఏర్పాటు చేస్తామన్నారు.
ఏకకాలంలో ఇంత పెద్ద ఎత్తున విద్యాలయాలను ఏర్పాటు చేయడం బీసీలకు ఒక మైలురాయిగా చెప్పవచ్చని, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టానికి అధిక భారం పడినా ముఖ్యమంత్రి బీసీలకు ఎంతో మేలు చేశారని అన్నారు. ఒక్కో పాఠశాలలో 240 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిష న్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వీటిని అద్దె భవనాల్లో ఏర్పాటు చేస్తున్నామని, దశల వారీగా పక్కా భవనాలు నిర్మించుకుంటామని, డిగ్రీ కళాశాలల్లో నిపుణులు సూచించిన 8 డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు. బీసీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం బాగా డిమాండ్ ఏర్పడిందని, ఒక్కో పాఠశాలలో వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.
అలాగే, డిగ్రీ కళాశాలల్లోనూ డిమాండ్ ఉన్న కోర్సులనే ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఫ్యాకాల్టీని రిక్రూట్ చేస్తున్నామని, ఈ అకాడమిక్ ఇయర్లోనే అన్ని కోర్సులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పెద్దపల్లి. జగిత్యాల జిల్లా పర్యటన తర్వాత సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు వస్తున్నారని, మెడికల్ కళాశాలకు శంకుస్థాపనతోపాటు వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు అంగీకరించారని తెలిపారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలు అప్పటి వరకు పూర్తయితే వాటిని కూడా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
మెడికల్ కళాశాల కోసం తెలంగాణ సీడ్స్ కో ఆపరేషన్ స్థలంలో 25 ఎకరాలు తీసుకున్నామని, ఇక్కడే సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని చెప్పారు. జిల్లాకు త్వరలో నర్సింగ్ కాలేజీ కూడా మంజూరుకాబోతున్నదని మంత్రి వెల్లడించారు. కరీంనగర్లో రోడ్లు వేసుకోవడమే కాకుండా చాలా నీట్‌గా ఉంచుకుంటున్నామని, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేసుకున్న తర్వాత కరీంనగర్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏడాదిన్నరలో తెలంగాణకు కరీంనగర్ గొప్ప ఆసెట్గా మారిపోతుందన్నారు. కరీంనగర్ అనేది అందమైన ప్రదేశంగా నిలవబోతున్నదని వివరించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్ బండారి వేణు, నాయకులు గెల్లు శ్రీనివాస్, చల్ల హరిశంకర్, పెద్ది రమేశ్, పొన్నం అనిల్‌గౌడ్, వాసాల రమేశ్ పాల్గొన్నారు.