ఎదులాపురం, జనవరి 24 : అంధత్వాన్ని నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, నిబంధనల మేరకు కంటి పరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని బంగారిగూడ, సు భాష్నగర్, హమాలీవాడ, వైటీసీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆన్లైన్ నమోదులో జరిగిన లోపాలు సరిచూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కువగా కంటి సమస్యలతో బాధపడుతున్నారని, దాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. వంద రోజుల ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గం టల వరకు కచ్చితంగా క్యాంప్‌లో సిబ్బంది అందరూ ఉండాలన్నారు. కంటి పరీక్షల్లో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా ముందువరుసలో ఉండేలా కష్టపడి పని చేయాలని సూచించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లకు సలహాలు, సూచనలు చేశారు. ఈ క్యాంపులో మెడికల్ ఆఫీసర్లు సుజాత, పుణమ్, నరేందర్, ఆప్తమెట్రిక్ సౌందర్య, సీవోలు విష్ణు, నవీన్ కుమార్, సిబ్బంది తదితరులున్నారు.
ఇచ్చోడ మండలంలో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ పరిశీలించారు. కంటి శిబిరానికి వచ్చిన వారి వివరాల నమోదు, పరీక్షల నిర్వహణ, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, శివ కుమార్ రెడ్డి, ఎస్కే మహ్మద్, నాయకులు పాల్గొన్నారు.
కేంద్రాల పరిశీలన
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ట్రైనీ కలెక్టర్ శ్రీజ, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సందర్శించారు. కంటి పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షలు చేయించుకునే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె సూచించారు. పల్లెల్లో ఉచిత కంటి పరీక్షలపై చాటింపు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఆమె వెంట మండల వైద్యాధికారి శ్యాంసుందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలో..
మండలంలోని కరంజి(టీ) పంచాయతీలో కంటి వెలుగు శిబిరం కొనసాగుతున్నది. కరంజి(టీ), అనుబంధ గ్రామం రాజులవాడిలో రోజూ ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది కంటి వెలుగుపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్ కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. 200 మందికి పరీక్షలు చేశారు. 40 మందికి కళ్లద్దాలు అందజేశారు. 12 మందికి ప్రత్యేక కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆపరేషన్ కోసం 30 మందిని గుర్తించారు. కంటి వ్యాధులకు సంబంధించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వైద్యాధికారులు విజయసారథి, నిఖిల్రాజ్, వడ్డారపు అశ్విని, శివాణి, హెచ్‌ఈవో లింగంపల్లి జ్ఞానేశ్వర్, సిబ్బంది బింగి గంగాధర్, లూసి, సుజాత, సరస్వతి, జనాబాయి, శ్రీకాంత్, రోజా, సర్పంచ్ జి.స్వాతిక, ఉపసర్పంచ్ ఏ.లక్ష్మీబాయి, కార్యదర్శి నితిన్, జీపీ సిబ్బంది పూండ్ర రవి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పరీక్షలు
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో సాయిప్రసాద్ వైద్య సిబ్బందికి సూచించారు. ఉమ్మడి మండలంలోని నార్నూర్, దాబా(కే) గ్రామాల్లో పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. దాబా(కే)లో ఎంపీడీవో సాయిప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇక్కడ వైద్య సిబ్బంది ఉన్నారు.