దిలావర్పూర్, అక్టోబర్ 26 : కాళేశ్వరం ప్యాకేజీ-27 కాలువ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నది. గుండంపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఓపెన్ కాలువతో రైతులకు లబ్ధి చేకూరుతున్నది. ఈ పనులు 2011 సంవత్సరంలో ప్రారంభించినప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.714 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే గుండంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఓపెన్ కాలువతో రైతుల ప్రయోజనాలకు చేకూర్చుతున్నది. ఇటీవల దీనిని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ప్రారంభించి రైతులకు సాగునీరు అందించారు.
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ నుంచి గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న ఓపెన్ కాలువ ద్వారా గ్రామానికి చెందిన ఎంతో మంది రైతులు 147 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు బోరుబావుల ద్వారా మూడు నుంచి ఐదు ఎకరాల్లో పంటలు సాగు చేసే రైతులు నేడు 10 నుంచి 15 ఎకరాల్లో పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
దీంతో ప్రతి సంవత్సరం రెండు, మూడు పంటలు సాగు చేయడంతో పాటు ఈ కాలువ పరిసర ప్రాంతంలో ఉండడంతో భూగర్భజలాలు పెరిగినాయని రైతులు చెప్పుతున్నారు. ఓపెన్ కాలువలో కుండ మోటర్లను ఏర్పాటు చేసి 2కిలోమీటర్ల మేరకు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ వేసి పంటలను పండిస్తున్నారు. దీనికి తోడుగా ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు రైతులకు 24 గంటల కరెంట్‌ను ఇవ్వడంతో రోజంత మోటర్లను నడిపిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులను రాజు చేస్తున్నదని చెప్పుటకు కాళేశ్వరం ప్యాకేజీ 27 ఓ ఉదాహరణ.
మా పంట చేనుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంగా ప్యాకేజీ 27 ఓపెన్ కాలువ ఉంటుంది. నాకున్న బోరుబావి ద్వారా తమ భూమిసాగు కాదని గమనించి ఓపెన్ కాలువలో మోటర్‌ను ఏర్పాటు చేసి భూమిలో నుంచి పైప్‌లైన్ వేసి పంట చేను వరకు తీసుకవచ్చా. దీంతో బటన్ నొక్కితే చాలు మూడు ఇంచ్‌ల మందం నీరు పోస్తుంది. మండుటెండల్లోను తాను పంటను సాగు చేశా. కాళేశ్వరం ప్యాకేజీ 27 ఓపెన్ కాలువ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
-ఏలాల చిన్నరెడ్డి, రైతు, గుండంపల్లి
కాళేశ్వరం ప్యాకేజీ-27 రావడంతో మా ఊరు భూములతో పాటు చుట్టూపక్కల ఉన్న భూములకు ధర పెరిగింది. ప్రతి సంవత్సరం మూడు పంటలు సాగు చేస్తున్నాం. మా ఊరు సమీపంలో ఓపెన్ కాలువ ఉండడంతో కిలోమీటర్ల మేరకు పైపులైన్ వేసి పంటలు సాగు చేస్తున్నాం. కాలమేదైన మాకు మాత్రం ఎప్పుడు నీళ్లు ఉంటున్నాయి.
-భోజారెడ్డి, రైతు, గుండంపల్లి