కోటపల్లి, ఆగస్టు 29: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో క్రమబద్ధీకరణ ఆనందం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందజేస్తుండడంతో, జేపీఎస్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రొబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 4 పంచాయతీలుగా విధులు నిర్వర్తించనున్నారు. కోటపల్లి మండలంలో నాలుగేళ్లు ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులు తొమ్మిది మంది ఉండగా, వారికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ చేతుల మీదుగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందుకున్నారు.
ఆనందంలో జేపీఎస్‌లు
పల్లెలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రతి పంచాయతీకి జూనియర్ పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఈ కాలాన్ని మరో ఏడాదికి పొడిగించి, వారి వేతనాన్ని రూ.29 వేలకు పెంచింది. నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అసిస్టెంట్ కలెక్టర్, డీఎఫ్‌వో, ఎస్పీల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు గ్రామాల్లో పర్యటిస్తూ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందజేస్తున్నారు. ఇక గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులు అందుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రగతిలో ప్రత్యేక ముద్ర
పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకంగా మారింది. పల్లెలో పరిశుభ్రతతో పాటు మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఇంటి పన్నుల వసూలులో వేగం పుంజుకుంది. తెలంగాణలోని ప్రతి పల్లె స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంతో జాతీయ స్థాయిలో తెలంగాణలో అవార్డులు రావడం వెనుక జేపీఎస్లే కీలకం. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, వారికి ఎనలేని ఆనందాన్ని అందించింది.
ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకం
మా సర్వీస్‌ను క్రమబద్ధీకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మమల్ని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. నాలుగేళ్లలో గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కృషి చేశాం. మా సేవలను ప్రభుత్వం గుర్తించింది. మేం మరింత బాధ్యతతో పనిచేసేలా క్రమబద్ధీకరణతో మాకు ప్రోత్సాహానిచ్చింది.
-సద్దనపు శిల్పాచారి, లింగన్నపేట, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
నాలుగేళ్లుగా మేం చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. మమ్మల్ని క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటం. తెలంగాణ ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చడంలో మా వంతు పాత్ర పోషిస్తాం. అందరికీ ఉత్తర్వులు త్వరలోనే అందుతాయని చెప్పింది. క్రమబద్ధీకరణ ఉత్తర్వు అందుకోడం చాలా సంతోషమనిపించింది.
-తాజుద్దీన్, ఎసన్వాయి, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి
బాద్యత పెరిగింది
ప్రభుత్వం గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిగా నియమించడంతో మాపై మరింత బాధ్యత పెరిగిం ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ప్రతి పంచాయతీని అభివృద్ధి బాటలో పయనించేలా చేయడం జరిగింది. ప్రభుత్వం మాపైన పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతాం. పల్లెల అభివృద్ధిలో కచ్చితంగా మావంతు పాత్ర పోషిస్తాం.
-తనుగుల శైలజ, వెలమపల్లి, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి
పల్లెల అభివృద్ధికి మరింత కృషి
ప్రభుత్వం మమ్మల్ని క్రమబద్ధీకరించడం మా అదృష్టం. చాలా రోజులుగా మా ఎదురు చూపులు ఇప్పుడు ఫలించాయి. సీఎం కేసీఆర్ చేస్తారనే నమ్మకం ఉండే. ఇప్పుడు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. పల్లెల అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తాం. మా కష్టాన్ని, సేవలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-సరిగమల సదయ్య, సిర్సా, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి