కెరమెరి, జనవరి 6 : మహారాజ్‌గూడ సమీపంలోని అటవీప్రాంతలో కొలువైన జంగాబాయికి శుక్రవారం ఆదివాసులు అత్యంత వైభవంగా ‘మహాపూజ’ నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ హాజరై సామూహిక పూజలు చేశారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆదివాసుల ఆరాధ్యదైవం, కెరమెరి మండలం మహారాజ్‌గూడ సమీపంలోని అటవీప్రాంతలో కొలువైన జంగాబాయి మహాపూజ శుక్రవారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మాజీ ఎంపీ నగేశ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు వారికి ఘనస్వాగతం పలుకుతూ ఆహ్వానించగా.. ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాలతో వేడుకలకు తీసుకువచ్చారు. అనంతరం 8 గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపూజలో పాల్గొన్నారు. హాజరైన అతిథులకు కమిటీ నాయకులు సంప్రదాయ రుమాలు కట్టి సభ వేదికపై ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ , పీవో మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే వేడుకలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇప్పటికే పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులతో రహదారికి మరమ్మతులు చేశామని, పైపులైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి విద్యుత్, శాశ్వత రోడ్డు, ఆలయానికి సంబంధించిన భూమికి హక్కు పత్రాలు వంటివి పూర్తి స్థాయిలో అందిస్తామని పేర్కొన్నారు. వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం యేటా అందించే రూ.10 లక్షలతో పాటు హుండీ డబ్బులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ, మహారాష్ట్ర భక్తులను కోరారు. ఎమ్మెల్యే, మాజీ ఎంపీ , ఐటీడీఏ చైర్మన్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తూ, ఆచార వ్యవహారాలను వచ్చే తరాలకు అందించేలా చూడాలన్నారు. నిత్యం అమ్మవారి సేవలో ఉండే 8 గోత్రాల కటోడాలకు ఆలయ ప్రాంగణం వద్ద గృహాల మంజూరుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ నాయకులు అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎంపీవో సుదర్శన్, ఎస్ఐ వెంకటేశ్, నాయకులు జాకు, మరప బాజీరావ్, ఆత్రం లక్ష్మణ్‌రావ్, దౌ లత్రావ్, రాయిసిడాం జంగు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఘనంగా పోతరాజు ఉత్సవాలు..
కెరమెరి, జనవరి 6: మండలంలోని ఉత్తూర్పేటలో గల కొలాం ఆదివాసీల దేవత పోతరాజు ఉత్సవాలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నా రు. ఉమ్మడి జిల్లాలోని కొలాం ఆదివాసులు తరలివచ్చి సంప్రదాయ పూజలు చేసి మొక్కులు తీ ర్చుకున్నారు. ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, ఏపీవో భాస్కర్, డీడీ మణెమ్మ, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్ హాజరై పూజలు చేశారు. ఆచార వ్యవహారాలు, వేడుకల నిర్వహణ విషయాలను పీవో అడిగి తెలుసుకున్నారు. వేడుకలకు వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను కమిటీ నాయకులు శాలువాలతో సన్మానించారు. వైస్ ఎంపీపీ అబూల్ కలాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనంద్‌రావ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు కమిటీ చైర్మన్ సిడాం ధర్ము, కమిటీ నాయకులు సిడాం గంగు, రాజు, భీంరావ్, పోచిరాం పాల్గొన్నారు.