కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఆహార మెనూను అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కెరమెరి మండలంలోని పలు ఆశ్రమ పాఠశాలలను ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ సందర్శించగా హట్టి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు స్వయంగా చపాతీలు చేస్తూ కనిపించారు. అల్పాహారం మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు వంటలో వంటలో చేయి వేయాల్సిందేనని విద్యార్థులు చెబుతున్నారు. సిబ్బంది లేకపోవడంతో మరికొందరు విద్యార్థులు గోళీలు ఆడుతూ కనిపించారు.
ఇక అనార్పల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంగా పూరిని ఇచ్చారు. ఆలుగడ్డ కూర ఇచ్చినా నీళ్ల చారును తలపిస్తున్నది. ఇక విద్యార్థులు మట్టిలోనే కూర్చొని అల్పాహారాన్ని తింటూ కనిపించారు. ఆ సమయంలో విద్యార్థులను పర్యవేక్షించాల్సిన వార్డెన్, ఏ ఒక్క ఉపాధ్యాయుడు గాని కనిపించలేదు. అసలే పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు శ్రద్ధ పెట్టాల్సింది చదువులపైనే. కానీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పట్టించుకున్నవారే లేకుండా పోయారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితికి ఇది అద్దం పడుతున్నది. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.